జహీరాబాద్, నవంబర్ 21: వానకాలం పత్తి పండించిన రైతులు పరేషాన్లో ఉన్నారు. ఈసారి అధిక వర్షాలకు పత్తి పంట బాగా దెబ్బతిని దిగుబడులు తగ్గాయి. ప్రస్తుతం పత్తి పంట చేతికి రాగా, రైతులకు కూలీల కొరత వేధిస్తున్నది. కూలీలు దొరక్క కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాలను నుంచి రప్పించుకుంటున్నారు. దీంతో పత్తి ఏరేందుకు కూలీలకు అధికంగా డబ్బులు చెల్లించాల్సి వస్తున్నది. మెదక్, సిద్దిపేట జిల్లాలతో పోలిస్తే సంగారెడ్డి జిల్లాలో రైతులు పత్తి ఎక్కువగా సాగుచేస్తారు.
ఈసారి వానకాలంలో సంగారెడ్డి జిల్లాలో 1.04 లక్షల ఎకరాలు, మెదక్ జిల్లాలో 36 వేల ఎకరాల్లో పత్తి పండించారు. సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ ప్రాంతంలో ఎక్కువగా పత్తి పండిస్తారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంగం, కోహీర్, మొగుడంపల్లి మండలాల పరిధిలోని గ్రామాల్లో 62, 787 ఎకరాలల్ల్లో పత్తి సాగు చేశారు.ఆగస్టు నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు పత్తి పంటపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. వానకు పత్తిలో తెగుళ్లు, చీడపురుగుల ఉధృతి అధికమైంది. కలుపు తీసే పరిస్థితి లేకుండా పోవడంతో చేను బలంగా పెరగలేదు.
గూడా రాలిపోవడంతో చెట్టుకు 50 నుంచి 60 కాయలు కాయాల్సి ఉండగా, 20 నుంచి 30 వరకు కాశాయి. ఈసారి లగోడి కూడా వచ్చే పరిస్థితి లేదని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీల కొరత తీవ్రంగా ఉండడంతో కూలికి అధికంగా చెల్లించాల్సి వస్తున్నది. ఒక్కో కూలీకి సుమారు రూ. 500 నుంచి 800 వరకు చెల్లిస్తున్నామని రైతులు చెబుతున్నారు. జీపులు, ఆటోవాలాలకు కూలీలను తీసుకువచ్చేందుకు రోజుకు రూ. 800 నుంచి 1,200 వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు పేర్కొంటున్నారు.
వర్షాలు, చీడపీడలను ఎదుర్కొని పత్తి పండించిన రైతులకు మద్దతు ధర లభించడం లేదు. సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం రైతులకు శాపంగా మారింది. ప్రభుత్వ మద్దతు ధర రూ. 7,521 ఉండగా, వ్యాపారులు సిండికేట్గా మారి రూ. 6,800 లకు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు తేమశాతం పేరుతో తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను నిండా ముంచుతున్నారు. ఇంత జరుగుతుంటే వ్యవసాయాధికారులు, సీసీఐ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకుని పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు తొలిగించాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ. 10 వేలకు కొనుగోలు చేస్తే లాభం రాకున్నా నష్టాల నుంచి బయటపడుతామని రైతులు పేర్కొంటున్నారు.
పత్తి తెంపేందుకు కూలీలు కొరతతో ఇబ్బందులు తప్పడం లేదు. పత్తి పంట పై ఎన్నో ఆశలు పెట్టుకున్నం. కానీ, అధిక వర్షాలకు పంటకు తెగుళ్లు సోకి దిగుబడులు తగ్గాయి. పత్తిని తెంపేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తెప్పించుకుంటున్నాం. కూలి బాగా చెల్లించాల్సి వస్తున్నది. వేలాది రూపాయలు ఖర్చు చేసి పంటలను సాగు చేస్తే పెట్టుబడులు చేతికి వచ్చే పరిస్థితి లేదు. సీసీఐ కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించకపోవడంతో తక్కువ ధరకే పత్తిని వ్యాపారులకు అమ్ముకుంటున్నాం.
– డప్పూర్ సంగారెడ్డి, రైతు, హద్నూర్ (న్యాల్కల్ మండలం)