కంది, ఫిబ్రవరి 20: కొన్నేండ్లుగా ఫార్మా కంపెనీల్లో పల్లాడియం కార్బన్ చోరీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సంగారెడ్డి జిల్లా పోలీసులు, సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట, సీసీఎస్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఆరుగురిని అరెస్టు చేసి సుమారు రూ.4.50కోట్ల విలువైన పల్లాడియం కార్బన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
గురువారం సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాకు ఎస్పీ చెన్నూరి రూపేశ్ వివరాలు వెల్లడించారు. ఈనెల 8న సదాశివపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని యావాపూర్‌లో గల ఆరీన్ లైఫ్ సైన్సెస్ యూనిట్-3 కంపెనీలో జరిగిన పల్లాడియం కార్బన్ చోరీపై ఆ కంపెనీ సీనియర్ హెచ్ఆర్ మేనేజర్ మజ్జి సూరప్ప నాయుడు ఫిర్యాదు మేరకు సదాశివపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
నూతన సాంకేతికత, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈనెల 19న మద్దికుంట చౌరస్తాలో ఆరుగురు నేరస్తులను పట్టుకొని, వారి నుంచి 96 కిలోల పల్లాడియం కార్బన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులు అంతర్రాష్ట్ర ముఠాగా ఏర్పడి పలు ఫార్మా కంపెనీల్లో దొంగతనాలకు పాల్పడినట్లు ఎస్పీ వెల్లడించారు. నిందితుడు అల్లం సాంబశివుడు వివిధ ఫార్మా కంపెనీల్లో పనిచేయడంతో పల్లాడియం కార్బన్ అత్యంత విలువైందని తెలిసిందన్నారు.
అల్లం సాంబశివుడు, ప్రసాద్ సాహెల్ షిటోల్, ఆదిత్య అంకుష్ మన్నె, తమ్మ ముక్కంటిరెడ్డి, మట్టా కుటుంబరావు, గుమ్మడి శ్రీనివాస్‌రావుతో పాటు పరారీలో ఉన్న మరి కొందరితో ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడ్డారు. అల్లం సాంబశివుడు గతంలో పూణెలో ఓ ఫార్మా కంపెనీలో పనిచేసే సమయంలో ప్రసాద్, అమోల్ జాగడే (రాజు)తో పరిచయం ఏర్పడడంతో పల్లాడియం కార్బన్ చోరీ చేసి తీసుకురావాలని కోరాడు.
అనంతరం పూణెలో జాబ్ మానేసి హైదరాబాద్ వచ్చి పల్లాడియం కార్బన్ లభించే ఫార్మా కంపెనీలపై ఆరా తీశాడు. ఆ కంపెనీల్లో పనిచేసే స్టోర్ సిబ్బందికి డబ్బుల ఆశచూపి సమాచారం సేకరించి ప్రసాద్, అమోల్ జాగడే ముఠాకు తెలియజేసేవాడు. 2023లో నేరస్తులు సాంబశివుడు, అమోల్ జాగడే, అతడి గ్యాంగ్ సభ్యులు గుమ్మడిదల పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొంతపల్లి న్యూలాండ్ కంపెనీలో 35కిలోలు, 2024 నవంబర్‌లో బొల్లారంలోని రాంప్యాక్స్ కంపెనీలో 8కిలోలు, కర్ణాటకలోని బీదర్ సాయి లైఫ్ సైన్సెస్‌లో సుమారు 17 కిలోల వరకు పల్లాడియం కార్బన్ చోరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు.
20 రోజుల క్రితం సాంబశివుడు సదాశివపేట పరిధిలోని యావాపూర్ ఆరీన్ లైఫ్ సైన్సెస్ యూనిట్-3 గురించి తెలుసుకొని ప్రణాళిక ప్రకారం ఆ కంపెనీ స్టోర్ మేనేజర్ ముక్కంటి రెడ్డికి డబ్బుల ఆశ చూపి, మెటీరియల్ పూర్తి వివరాలు ప్రసాద్ గ్యాంగ్‌కు చెప్పాడు. ఈనెల 8న రాత్రి 120 కిలోల పల్లాడియం కార్బన్ దొంగలించినట్లు విచారణలో తేలిందని, దీని విలువ రూ.4.50 కోట్లు ఉంటుదని ఎస్పీ వెల్లడించారు. ఈ కేసు ఛేదించిన పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు, డీఎస్పీ సత్తయ్య గౌడ్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.