సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 21: బెస్ట్ అవైలబుల్ పాఠశాల(బీఏఎస్) విద్యార్థుల పెండింగ్ నిధులు విడుదల చేయాలని తెలంగా ణ సోషల్ ఫోరం(టీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని గ్రీవెన్స్‌హాల్‌లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అర్జీదారులు తమ ఫిర్యాదులను అధికారులకు అందజేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రజావాణిలో మొత్తం 71అర్జీలు అందాయి.
ఆయా అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ఈ క్రమంలో టీఎస్ఎఫ్ నాయకులు లక్ష్మణ్, వేణుగోపాల్, భగత్, ఎర్రగొళ్ల శేఖర్, రామ్, సుభాష్ కలెక్టర్‌కు అర్జీ అందజేస్తూ ఉమ్మడి మెదక్ జిల్లా విద్యార్థుల బెస్ట్ అవైలబుల్ స్కూల్‌కి సంబంధించి 2023-24, 2024-25 విద్యా సంవత్సరాల నిధు లు రాక విద్యార్థులు, విద్యాసంస్థల యజమానులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. వెంటనే రూ.4 కోట్ల 90 లక్షల నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, రెవెన్యూ అధికారి పద్మజారాణి, ఏవో పరమేశ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.