గుమ్మడిదల, మార్చి 24: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రూ.రెండు వందలు ఉన్న పింఛన్ రూ. రెండు వేలు ఇచ్చి ఆసరాగా నిలిచారు. పదేండ్లలో ప్రతి నెలా పింఛన్ దారులకు రూ. రెండు వేలు వచ్చేవి. అప్పుడు వృద్ధులు, వితంతువులు, దివాంగులు, ఒంటరి మహిళలకు పింఛన్లు ఆసరాగా నిలిచాయి. పింఛన్‌దారులు తమకు వచ్చే పింఛన్‌తో ధైర్యంగా జీవించారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల సంతానం కూడా వారిని ఆదరించే వారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్‌దారులకు రూ. రెండు వేలకు బదులు రూ. నాలుగు వేలు ఇస్తానని హామీ ఇచ్చింది. కానీ రెండున్నర ఏండ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు.
ప్రతి నెలా వచ్చే పింఛన్ నెల ఆలస్యంగా రావడంతో పాటు ఆ పింఛన్ కూడా ప్రతినెలా 22వ తేదీన రావడంతో పింఛన్‌దారులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో 22వ తేదీన వచ్చే పింఛన్ల కోసం వారం రోజుల పాటు సర్వర్ పని చేసేది. వారం రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో గత నెల వచ్చే పింఛన్ ఈనెల 10వ తేదీన రావడంతో పోస్టుమాన్ 11, 12 తేదీల్లో పింఛన్ దారులకు నగదు ఇచ్చారు. ఆ రెండు రోజులు ఇచ్చిన పింఛన్ నగదు సరిపడా రాక పింఛన్‌దారులకు నగదు ఇవ్వలేకపోయారు. 13వ తేదీన పింఛన్ నగదు రావడంతో గుమ్మడిదల, బొంతపల్లి, అన్నారం, నల్లవల్లి, కానుకుంట తపాలా కార్యాలయాల వద్దకు ఆసరా పింఛన్ తీసుకుందామని వచ్చిన పింఛన్ దారులకు విచిత్ర ఘటన ఎదురైంది.
గుమ్మడిదల మండలంలోని ఐదు తపాలా కార్యాలయాల్లో పింఛన్ నగదు ఇవ్వడానికి సిద్ధమైన బీపీఎంలకు పింఛన్ సర్వర్ డౌన్ కావడంతో ఉన్న నగదు ఇవ్వడానికి సర్వర్ పనిచేయడం లేదు. దీంతో వారు పింఛన్‌దారులకు నగదు ఇవ్వలేక చేతులు ఎత్తేశారు. దీంతో ఆగ్రహించిన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు చేసేది ఏమిలేక జాతీయ రహదారిపై ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ప్రతినెలా పింఛన్‌పై ఆధారపడేవారు నగదు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రతి నెలా ఇవాల్సిన పింఛన్ నెల ఆలస్యమైనా తీసుకున్నాము, మరి ఇప్పుడు సర్వర్ ఉంటే నగదు ఉంటలేదు.. నగదు ఉంటే సర్వర్ పనిచేయడం లేదని వృద్ధులు పేర్కొంటున్నారు.
రెండు నెలలు దాటి మూడో నెల సాంకేతిక లోపం వల్ల పింఛన్ తీసుకోని పింఛన్‌దారులకు పింఛన్ క్లోస్ అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హామీలో ప్రతినెలా రూ. నాలుగు వేలు ఇస్తానన్న ప్రభుత్వం ఉన్న రూ. రెండువేలు ఇస్తుంది. అది కూడా నెల ఆలస్యంగా ఇవ్వడమే కాకుండా కొత్తగా సర్వర్ వినియోగంలోకి రాక పింఛన్లకోసం పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయంపై జిల్లా అధికార యంత్రాంగం స్పందించి గుమ్మడిదల మండలంలోని పింఛన్‌దారులకు నగదు ఇవ్వడానికి సర్వర్‌ను వినియోగంలోకి తీసుకురావాలని పింఛన్‌దారులు కోరుతున్నారు.