రామాయంపేట, జూన్ 16: ఆన్లైన్ బెట్టింగ్తో మోసపోయిన ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, రామాయంపేట పోలీసుల వివరాల ప్రకారం… రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన దొమ్మాట భానుప్రసాద్(24) కొన్ని రోజులుగా ఆన్లైన్లో గేమ్‌లు ఆడుతున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్‌లు పెడుతూ రూ.1.50 లక్షలను ఆటలో పోగొట్టుకున్నాడు. తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఐదురోజుల క్రితం తన వ్యవసాయ బావివద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. బావివద్దకు వెళ్లిన కొడుకు ఇంకా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు అక్కడికి వెళ్లిచూడగా అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే కుటుంబీకులు రామాయంపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. వైద్యుల సూచన మేరకు వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం మృతిచెందాడు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు దొమ్మాట బాల్‌నర్సింహులు, బాలలక్ష్మి కన్నీరు మున్నీరుగా విలపించారు. రామాయంపేట ప్రభత్వ దవాఖానలో పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రామాయంపేట పోలీస్ సర్కిల్ వ్యాప్తంగా యువత ఆన్లైన్ బెట్టింగ్‌లకు, సైబర్ నేరాలకు గురికాకుండా కొంతకాలంగా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రామాయంపేట సీఐ వెంకటరాజాగౌడ్, ఎస్సై రంజిత్ తెలిపారు. ప్రగతి ధర్మారంలో యువకుడు భానుప్రసాద్ ఆన్లైన్ బెట్టింగ్ బారినపడి ఆత్మహత్యకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. యువత ఇలాంటి బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని సూచించారు.