నంగునూరు, జూలై 22 : ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ పనులను త్వరగా పూర్తిచేయాలని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం సిద్దిపేట జిల్లా నం గునూరు మండలం నర్మెటలో రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ పనులను ఆయిల్‌ఫెడ్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అత్యాధునిక టెక్నాలజీ, అన్ని వసతులతో ఫ్యాక్టరీ నిర్మిస్తున్నట్లు తెలిపారు. నూనె ఉత్పత్తి చేయడమే కాకుండా.. రిఫైనరీని పెట్టి ఫైనల్ ప్రొడక్ట్‌ను ఇక్కడి నుంచే నేరుగా మార్కెట్లోకి పంపించడం జరుగుతుందన్నారు.
రైతులు పండించిన ఆయిల్‌పామ్ రవాణాకు సంబంధించిన ఖర్చును ఫ్యాక్టరీయే చెల్లిస్తుందన్నారు. దేశానికి ఏడాదికి కోటి టన్నుల పామాయిల్ అవసరం ఉందని కానీ 3 లక్షల టన్నులే అందుబాటులో ఉందన్నారు. ఆయిల్‌పామ్ మెట్రిక్ టన్నుకు రూ.18 వేలు ఇవ్వాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ద్వారా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కేంద్రంపై ఒత్తిడి పెంచేలా అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తామన్నారు. కేంద్రం ఇటీవల దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో విదేశాల నుంచి మన దేశానికి పెద్ద మొత్తంలో ఆయిల్‌పామ్ దిగుమతి అవుతుందన్నారు. ఆయిల్‌పామ్‌లో అంతరపంటగా వేరుశనగ, పత్తి, కోకో, నాటుకోళ్ల పెంపకం చేపట్టి అధిక ఆదాయం పొందాలని రైతులకు ఆయన సూచించారు.