సిద్దిపేట అర్బన్/నంగునూరు, ఏప్రిల్ 17: భూ సమస్యల పరిష్కారం దిశగా ధరణి స్థానంలో కొత్తగా భూభారతి పోర్టల్ రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందని సిద్దిపేట అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గరిమా అగర్వాల్ అన్నారు. గురువారం సిద్దిపేటలోని విపంచి కళా నిలయంలో, నంగునూరు మండల కేంద్రంలోని సాయిబాలాజీ ఫంక్షన్ హాల్లో భూభారతి చట్టం 2025పై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈమేరకు భూభారతి చట్టంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు, అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గరిమా అగర్వాల్ మాట్లాడుతూ.. ఈనెల 17 నుంచి 30 వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి సర్వే నెంబర్‌కు జియో భూధార్ కార్డులను జారీ చేయనున్నట్లు, ప్రతి గ్రామంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రికార్డులను నిర్వహిస్తామన్నారు.
భూభారతి పోర్టల్‌పై నిర్వహించిన అవగాహన సదస్సుకు రైతుల నుంచి స్పందన కరువైంది. సిద్దిపేట అర్బన్ మండలానికి సంబంధించి అవగాహన సదస్సును సిద్దిపేట పట్టణంలోని విపంచి కళా నిలయంలో ఏర్పాటు చేయగా.. ఆశించిన స్థాయిలో రైతులు హాజరుకాలేదు. రైతుల కోసమే ఏర్పాటు చేసిన భూభారతి పోర్టల్ అవగాహన సదస్సుకు కేవలం కొంతమంది కాంగ్రెస్ నాయకులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఇతర అధికారులు మాత్రమే హాజరయ్యారు.
రైతులకు ఉపయోగపడే ఈ పోర్టల్ సంబంధించిన అవగాహన సదస్సు జరిగితే రైతుల నుంచి స్పందన కరువైందని పలువురు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, ఆర్డీవో సదానందం, తహసీల్దార్లు సలీం, సరిత, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.