నర్సాపూర్, ఆగస్టు 4: మెదక్ జిల్లా నర్సాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు కొన్ని నెలలుగా మూతపడింది. చెక్‌పోస్టు వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారనే సాకుతో మార్కెట్ కమిటీ సిబ్బంది చెక్‌పోస్టును కొన్ని నెలలుగా తీయడంలేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. ప్రతి ఏడాది వ్యవసాయ మార్కెట్ కమిటీకి సుమారు రూ.3 కోట్ల వరకు ఆదాయం వస్తుంది.
నర్సాపూర్, శివ్వంపేట, చిలిపిచెడ్, కౌడిపల్లి, హత్నూర మండలాలకు చెందిన రైస్‌మిల్లులు, వడ్లు, మొక్కజొన్నలు, సివిల్ సైప్లె ద్వారా మార్కెట్ యార్డుకు ఆదాయం వస్తుంది. చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తే వాహనాలు తనిఖీ చేసి తద్వారా ఆదాయం పొందవచ్చు. చెక్‌పోస్టు లేకపోవడం వల్ల వాహనాలను తనిఖీ చేయక ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రాకుండా పోతున్నదనే విమర్శలు ఉన్నాయి.
మార్కెట్ యార్డు సిబ్బంది రోజూ తిరిగి వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చెక్‌పోస్టు ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై నర్సాపూర్ మార్కెట్ యార్డు సెక్రటరీ ప్రతాప్‌గౌడ్‌ను విరవణ కోరగా.. లారీలు ఆపడానికి స్థలం లేక చెక్‌పోస్టు ఓపెన్ చేయడం లేదన్నారు. రోజూ సిబ్బంది తిరిగి వసూలు చేస్తున్నారని తెలిపారు.