సిద్దిపేట టౌన, ఏప్రిల్ 7: ఉద్యమ నాయకుడిని అందించిన గడ్డ సిద్దిపేట అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో ‘సిద్దిపేట జిల్లా సాహిత్యం, చరిత్ర, సంస్కృతి’ అనే అంశంపై ఆన్లైన్ జాతీయ సదస్సు మంగళవారం ముగిసింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా నందిని సిధారెడ్డి హాజరై మాట్లాడారు. సిద్దిపేటకు వేముగంటి నరసింహాచార్యులు, కాపురాజయ్య రెండు కండ్ల వంటివారన్నారు. పల్లె ప్రజలభాష తెలంగాణకు ఆత్మవంటిదన్నారు.
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంతో మంది గొప్పవ్యక్తలుగా రూపుదిద్దుకున్నారన్నారు. కళాశాల కళాకారులు, గాయకులు, కవులను అందించి తెలంగాణ చైతన్యానికి మూలకందంగా నిలిచిందని కొనియాడారు. యువత పరిశోధనలపై ఆస్తకి పెంచుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగు సాహిత్యానికి విశేషమైన కృషి చేస్తున్న నందిని సిధారెడ్డి ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకోవడంపై ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత సంతోషం వ్యక్తం చేశారు.
ఇంత గొప్పగా జాతీయ సదస్సు నిర్వహించిన తెలుగుశాఖ అధ్యాపకులను ఆమె అభినందించారు. సదస్సు సంచాలకుడు డాక్టర్ మట్టా సంపత్కుమార్రెడ్డి మాట్లాడుతూ జాతీయ సదస్సులో వక్తలు మాట్లాడిన అనేక అంశాలను విద్యార్థులు విని నేర్చుకోవడంతో పాటు పరిశోధనలపై ఆసక్తి పెంచుకున్నారన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు విజయలక్ష్మి, ప్రమోద్ కుమార్, డాక్టర్ సమత, శంకరయ్య, మహేందర్, అయోధ్యరెడ్డి, పిట్ల దాసు, వెంకటరమణ, నరేశ్, సాయిసురేశ్, చక్రహరి, మధుసూదన్, రామస్వామి, జగదీశ్వరాచారి పాల్గొన్నారు.