అక్కన్నపేట, జనవరి 30: రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు… గుంట భూమి కూడా లేని నిరుపేద కుటుంబాలు వారివి..మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనులతో పాటు కూలీ, నాలీ చేసుకుంటూ బతుకుతున్నారు. విధి ఆ కుటుంబాలను చిన్నచూపు చూసింది. రెప్పపాటులో జరిగిన ప్రమాదంలో బండరాళ్లు, మట్టిపెళ్లలు మీద పడడంతో పనిచేసే చోటే తల్లీకూతురు దుర్మరణం చెందిన విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం… గోవర్ధనగిరికి చెందిన కందారపు సారవ్వ (50), మల్లయ్య దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు సంతానం. ఇందులో చిన్న కుమార్తె మమత (32)ను ఇదే గ్రామానికి చెందిన యోగేశ్వరచారికి ఇచ్చి పెండ్లి చేశారు. వీరికి కొడుకు రాఘవేంద్రచారి, కుమార్తె నిత్యమనుశ్రీ ఉన్నారు.
ఇరు కుటుంబాలకు ఎలాంటి వ్యవసాయ భూమి లేకపోవడంతో గ్రామంలో కూలీ పనులకు తల్లీకూతురు కలిసి వెళ్తుంటారు. సారవ్వ భర్త మల్లయ్య హుస్నాబాద్‌లోని ఓ సామిల్లో పని చేస్తుండగా, వీరి అల్లుడు యోగేశ్వరచారి గ్రామంలోనే వెల్డింగ్ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో నాలుగైదు రోజుల నుంచి గ్రామ సమీపంలోని సంజీవరాయుడి గుట్టకు ఉపాధిహామీ కూలీ పనులకు వెళ్తున్నారు. గురువారం ఉదయం ట్రాక్టర్లో గ్రామానికి చెందిన సుమారు 21మంది కూలీలు ఉపాధిహామీ పనులు చేసేందుకు వెళ్లారు. అక్కడ పని మొదలుపెట్టిన పది నిమిషాల్లోనే మమతపై బండరాళ్లు పడడంతో తల ఒకవైపు చిధ్రమైంది. సారవ్వ మీద మట్టిపెళ్లలు పడ్డాయి.
వీరి పక్కనే పనిచేస్తున్న ఇంద్రాల స్వరూప, వల్లబోజు మణెమ్మ కాళ్లు విరిగి తీవ్ర గాయాలు అయ్యాయి. మరో ముగ్గురు కూలీలు తాటికొండ విమల, ఇంద్రాల రేణుక, గౌడ వెంకటయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. జేసీబీ సాయంతో సారవ్వ మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనా స్థలాన్ని హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీశ్, సీఐ శ్రీనివాస్, తహసీల్దార్ అనంతరెడ్డి, ఎంపీడీవో జయరాం పరిశీలించారు. ఘటనకు గల కారణాలను తోటి కూలీలను అడిగి తెలుసుకున్నారు. తీవ్రంగా గాయపడిన స్వరూప, మణెమ్మను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. స్వల్పగాయాలైన కూలీలను హుస్నాబాద్ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి చికిత్స అందించారు. డీఆర్డీవో పీడీ జయదేవ్ ఆర్య, ఇతర అధికారులు హుస్నాబాద్ ప్రభుత్వ దవాఖానలో కూలీలతో మాట్లాడారు. సారవ్వ కుమారుడు శ్రీకాంత్, మమత భర్త యోగేశ్వరచారి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయభాస్కర్ తెలిపారు.
గోవర్ధనగిరిలో ఉపాధిహామీ కూలీలు మృతి చెందడం, పలువురికి గాయాలైన విషయం తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ ప్రకటనలో సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదుకోవాలని మాజీ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ కోరారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలు, గాయపడిన వారిని దళిత బహుజన ప్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ పరామర్శించి, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాయకులు ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఘటనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అదుకోవాలని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు తప్పనిసరిగా జీవితబీమా వర్తింపజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.