కొమురవెల్లి, అక్టోబర్ 3: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని గురువన్నపేటలో బాధిత బాలిక కుటుంబాన్ని గురువారం కురుమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ప్రభుత్వ వీప్ బీర్ల ఐలయ్య, డీసీసీ జనగామ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు క్యామ మల్లేశ్, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం మాట్లాడుతూ..బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని ఎన్‌కౌంటన్ చేయాలన్నారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమని, ఇటువంటి ఘటనలు జరిగిన వెంటనే కఠిన శిక్షలు పడేలా చట్టంలో మార్పులు చేయాలన్నారు.
బాలికపై దాడి జరగడంతోనే గ్రామస్తులు తిరగబడ్డారని, ఆడపిల్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, గ్రామస్తులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలన్నారు. బాలికకు ప్రభుత్వం నుంచి అవసరమైన సాయం అందిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ నాయకుడు క్యామ మల్లేశ్ మాట్లాడుతూ.. బడగు, బలహీన వర్గాలకు చెందిన బాలికపై జరిగిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలన్నారు. జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ..బాలికపై లైంగిక దాడి ఘటనను వ్యక్తిగతంగా, కాంగ్రెస్ పార్టీపరంగా తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కుటుంబానికి అవసరమైన సహాయం అందించడంతోపాటు నిందితుడికి కఠిన శిక్ష పడే విధంగా చర్యలు చేపడుతామన్నారు. గ్రామంలో 13మందిపై పెట్టిన కేసులను పోలీసులు ఉపసంహరించుకోవాలన్నారు.
కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా శిక్షలు ఉండాలని, దిశ కేసులో అప్పట్లో నిందితులకు ఎలాంటి శిక్ష పడిందో అలాంటి శిక్షే నిందితుడికి వేయాలన్నారు. అంతకుముందు సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధను కలిసి నిందితుడికి కఠిన శిక్ష పడేవిధంగా చర్యలు చేపట్టడంతోపాటు గ్రామస్తులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు. కార్యక్రమంలో కురుమ సంఘం రాష్ట్ర నాయకులు పుష్పానగేశ్, బాల్దె సిద్దిలింగం, సెవెల్లి సంపత్, జయ మల్లేశ్, మ్యాక సంతోష్‌కుమార్, బర్మ రాజమల్లయ్య, మహాదేవుని శ్రీనివాస్, బ్రహ్మండ్లపల్లి చంద్రం, బుడిగె ఐలేనిగౌడ్, అందే బీరయ్య, అందే అశోక్, నర్మింహ పాల్గొన్నారు.