గజ్వేల్, జనవరి 23: తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆపన్నహస్తం మిత్ర బృందం సేవలు అభినందనీయమని ఎమ్మె ల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. శుక్రవారం సుభాష్‌చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని తలసేమియా బాధితుల కోసం గజ్వేల్‌లో చేపట్టిన రక్తదాన శిబిరంలో 275యూనిట్ల రక్తం సేకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గజ్వేల్కే పరిమితమైన సేవలను జిల్లాలకు విస్తరించి, తర్వాత కేరళ రాష్ర్టానికి చేరేలా ఆపన్నహస్తం మిత్ర బృందం చేపట్టిన కార్యక్రమాలతో గజ్వేల్‌కు మంచి గుర్తింపు లభిస్తున్నదన్నారు.
కొంతమందితో మొదలైన ఈ మిత్రబృందం సేవలు, నేడు వందకు పైగా సభ్యులతో విస్తరించడం సంతోషంగా ఉందన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి కార్యక్రమాలు చేపడితే పేదలకు మేలు జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, సీఐ రవికుమార్, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్లు రాజమౌళి, భాస్కర్, మిత్రబృందం సభ్యులు బాలచంద్రం. శ్రీనివాస్ పాల్గొన్నారు.