హుస్నాబాద్, సెప్టెంబర్ 28 : మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. గురువారం హుస్నాబాద్ శివారులోని ఎల్లమ్మ చెరువులో తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్‌తో కలిసి చేపపిల్లలను వదిలారు. అనంతరం పోతారం (ఎస్)లోని శుభం గార్డెన్స్‌లో జరిగిన హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల మత్స్యకారుల సభలో గుర్తింపు కార్డులు, కొత్త సొసైటీలకు గుర్తింపు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2014కు ముందు గ్రామాల్లోని చెరువులు, కుం టలు పంచాయతీల పరిధిలో ఉండేవని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మత్స్యకారులకే హక్కులు కల్పించినట్లు తెలిపారు. చెరువులు, రిజర్వాయర్లలో ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేసి మత్స్యకారులు అమ్ముకునేలా మార్కెటింగ్ సౌక ర్యం కల్పిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
ముదిరాజ్ కులస్తులకు ప్రభుత్వం సబ్సిడీపై వాహనాలు, వలలు, భారీ వాహనాలను అందించిందన్నారు. కాళేశ్వరం, మిడ్‌మానేరు, గౌరవెల్లి రిజర్వాయర్లు మత్స్యకారులకు వరంగా మారబోతున్నాయన్నారు. గ్రామాల్లో అర్హులైన మత్స్యకారులందరికీ సభ్యత్వం ఇవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో దాదాపు అన్ని గ్రామాల్లో ముదిరాజ్ కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని తెలిపారు. హుస్నాబాద్‌లో ముదిరాజ్ భవన నిర్మాణానికి త్వరలో స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఫిషరీస్ సొసైటీల్లో పురుషులతో సమానంగా మహిళల సొసైటీలను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముదిరాజ్‌లు సీఎం కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయడంలో కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న, ఎంపీపీలు లకావత్ మానస, కొక్కుల కీర్తి, జడ్పీటీసీ భూక్యా మంగ, మార్కెట్ చైర్పర్సన్ ఎడబోయిన రజనీతిరుపతిరెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ అయిలేని అనితారెడ్డి, కౌన్సిలర్లు, మత్స్యశాఖ జిల్లా అధికారి మల్లేశం, బీఆర్ఎస్, ముదిరాజ్ సంఘం నాయకులు వంగ వెంకట్రామ్రెడ్డి, ఎండీ అన్వర్, పెండెల ఐలయ్య, ఆవుల మహేందర్, పొన్నబోయిన శ్రీనివాస్, చొప్పరి శ్రీనివాస్, పెసరు సాంబరాజు, బొల్లి శ్రీనివాస్, బాషవేని రాజయ్య, జనవేని శ్రీనివాస్, బొజ్జ హరీశ్, సత్తయ్య, వేముల శ్రీనివాస్, భిక్షపతి, యాదగిరి, రాజయ్య, మూడు మండలాల నుంచి వచ్చిన మత్స్యకారులు, ముదిరాజ్ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషితో ఇప్పటి వరకు రూ.33వేల కోట్ల విలువైన మత్స్య సంపద వృద్ధి జరిగినట్లు రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ తెలిపారు. రాష్ట్రంలోని 5లక్షల మంది మత్స్యకారుల్లో 3.50లక్షల మంది ముదిరాజ్ కులస్తులు చేపల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. మత్స్యకారులకు ఇప్పటి వరకు రూ.450కోట్ల విలువైన వాహనాలను సబ్సిడీపై అందించామని తెలిపారు. గత పాలకులు మత్స్యకారులు, ముదిరాజ్‌లను పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ కృషితో కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి తదితర ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు తెలిపారు.
మిషన్ కాకతీయతో చెరువుల అభివృద్ధి, మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలను అందజేసి మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంతో మత్స్యకారులకు గుర్తింపు వచ్చిందన్నారు. 63వేల మంది మత్స్యకారులకు సబ్సిడీ వాహనాలు అందించామన్నారు. రాబోయే రోజుల్లో మత్స్యకారులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలోని ముదిరాజ్ కులస్తులకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యతనిస్తున్నారని, ఇందుకు తాను ఫెడరేషన్ చైర్మన్ కావడమే నిదర్శనమని రవీందర్ చెప్పారు. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా సతీశ్‌కుమార్‌ను భారీ మెజార్టీతో మూడోసారి గెలిపించడంలో నియోజకవర్గంలోని ముదిరాజ్ కులస్తులు, మత్స్యకారులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.