కొమురవెల్లి, డిసెంబర్ 21 : దేశంలోనే అభివృద్ధిలోతెలంగాణ ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని మర్రిముచ్చాలలో రూ.2కోట్ల 38లక్షల అభివృద్ధి పనులకు ఎంపీపీ తలారి కీర్తనాకిషన్, జడ్పీటీసీ సిలువేరు సిద్ధప్ప, సర్పంచు బొడిగం పద్మాకృష్ణారెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు డప్పుచప్పుళ్లతో ఎమ్మెల్యేకు స్వాగతం పాలికారు. అనంతరం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కావాలని భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారని, కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు బంద్ చేయమనడం ఎంతవరకు సమంజసమన్నారు.
కొట్లాడి తెలంగాణ సాధించిన సీఎం కేసీఆర్‌కు ప్రజల సమస్యలపై అవగాహన ఉందన్నారు. దేశ ప్రజల కోరిక మేరకు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ స్థాపించి దేశ రాజకీయాల్లోకి వచ్చారని, రానున్న రోజుల్లో ఢిల్లీ పీఠం అధిరోహించడం ఖాయమన్నారు. అతి తక్కువ సమయంలోనే తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. బీఆర్ఎస్తో సుసంపన్నమైన భారతదేశంగా తయారుకాయడం ఖాయమన్నారు. నాడు తెలంగాణ వస్తే ప్రజలు చీకట్లో ఉంటారని కొంతమంది ఎద్దేవా చేశారని, అటువంటి తెలంగాణలో 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేయిస్తున్నారన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తే కాంగ్రెస్, బీజీపీ పాలిత రాష్ర్టాల్లో ఏం చేశారని ప్రజలు అడుగుతున్నారని దుయ్యబట్టారు. దమ్మంటే రాష్ర్టానికి వచ్చే 2లక్షల కోట్ల బకాయిలు తీసుకురావాలని బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధికి ప్రశంసాపత్రాలు ఇస్తున్నారని, ఇటీవల పచ్చదనంలో హైదరాబాద్ దేశంలో మొదటిస్థానంలో ఉందని కేంద్ర అధికారులు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ రాక ముందు తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిపై గ్రామాల్లో చర్చ జరగాలన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి సరిహద్దు రాష్ర్టాల ప్రజలు తమను తెలంగాణలోవిలీనం చేయాలని కోరుకుంటున్నారన్నారు.
అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గ్రామస్తులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. మల్లన్న ఆలయ చైర్మన్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గీస భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ వంగ చంద్రారెడ్డి, వైస్ ఎంపీపీ కాయిత రాజేందర్‌రెడ్డి, మల్లన్న ఆలయ డైరెక్టర్ నర్ర రఘువీరారెడ్డి, ఎంపీడీవో అనురాధ, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చదరుపల్లి నర్సింగరావు, రైతు బంధు సమితి కో ఆర్టినేటర్ తలారి యాదయ్య, ముత్యం నర్సింహులు, బీఆర్ఎస్వీ నాయకుడు ఏర్పుల మహేశ్, వరుగంటి శ్రీకాంత్, దాసరి పెద్ద నర్సింహులు పాల్గొన్నారు.