అక్కన్నపేట, అక్టోబర్ 31: వరద ఉధృతికి వాగులో గల్లంతై మరణించిన కల్పన,ప్రణయ్ దంపతుల మృతదేహాలు దొరికాయి. కడదాక కలిసి ఉంటామని పెళ్లినాటి బాసలు నిజం చేస్తూ ఒక్కరితోడుగా ఒకరు చావులోనూ కలిసిపోయారు. అర్ధాంతరంగా ఈ యువజంట జీవితం ముగిసిపోయింది. బర్త్ వేడుకలు విషాదాన్ని మిగిల్చాయి. కుటుంబీకుల రోధనలు, బంధువుల కన్నీళ్ల మధ్య శుక్రవారం కడసారి వీడ్కోలు పలికారు.
ఒకే చితిపై ఇద్దరి మృతదేహాలను ఉంచి అంత్యక్రియలు పూర్తిచేశారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటకు చెందిన మ్యాకల కల్పన(24)ను రెండేండ్ల క్రితం భీమదేవరపల్లికి చెందిన ఇసంపల్లి ప్రణయ్(28)కి ఇచ్చి వివాహం జరిపించారు. ఈనెల 29న కల్పన బర్త్ డే ఉండటంతో సాయంత్రం భర్త ప్రణయ్‌తో కలిసి బైక్‌పై అక్కన్నపేటకు బయలుదేరారు. కొత్తకొండ వద్దకు రాగానే మల్లారం వద్ద రోడ్డు తెగిందనే సమాచారంతో వీరు యూటర్న్ తీసుకొని ధర్మారం, మల్లంపల్లి మీదుగా మోత్కులపల్లికి వచ్చారు. అక్కడ లోలెవల్ బ్రిడ్జిపై వరద ఉధృతి ఎక్కువగా ఉందని తెలియక బైక్‌తో ముందుకు వెళ్లడంతో బైక్‌తో సహా కల్పన, ప్రణయ్ వరదలో గల్లంతయ్యారు.
వాగులో బైక్ కొట్టుకొచ్చిందని తెల్లవారుజామున పెద్దతండావాసి గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా ప్రణయ్ అడ్రస్ తెలిసింది. కుటుంబీకులకు విషయం చెప్పడంతో బర్త్ డే వేడుకల కోసం తమ కుమారుడు, కోడలు వెళ్లినట్లు మృతుడి తల్లి పోలీసులకు తెలిపింది. రెస్యూటీం వాగుతో పాటు మల్లంపల్లి చెరువులో గాలింపు చర్యలు చేపట్టింది. మొదట ప్రణయ్, తర్వాత కల్పన మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రశాంత్ తెలిపారు. అనంతరం మృతదేహాలను స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు.