
రాయపోల్, జనవరి 10 : ఆదాయం వచ్చే పంటలపై రైతులు దృష్టి సారిస్తున్నారు. . రాయపోల్ మండలంలో అధిక శాతం రైతులు వరికి వదులు ఇతర పంటలు పండిస్తున్నారు. ఇందులో భాగంగా రాంసాగర్ గ్రామానికి చెందిన కిచుగారి రాములు యాసంగిలో వరికి స్వస్తి పలికి ఎల్లిగడ్డ పంట సాగు చేస్తున్నాడు. తనకు ఉన్న ఎకరం పొలంలో ఎల్లిగడ్డను సాగు చేయడానికి రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. ముఖ్యంగా ఎల్లిగడ్డ పంట సాగుకు నీటి వసతి అవసరం కాగా, నాలుగు నెలల్లో కనీసం 5 సార్లు నీటి తడులు పెట్టాల్సి ఉంటుంది. ఎల్లిగడ్డ సాగుతో రైతు రాములుకు అధిక లాభాలు వస్తున్నాయని చెబుతున్నాడు. ప్రతి యాసంగిలో పంట మార్పిడి పాటిస్తానని, పోయిన యాసంగిలో ఉల్లి సాగు చేయగా.. ఈ యాసంగిలో ఎల్లిగడ్డ సాగు చేశానని తెలిపాడు. పంట ఆశాజనకంగా ఉందని, మార్కెట్లో ఎల్లిగడ్డకు భారీ డిమాండ్ ఉండడంతో అధిక ఆదాయం వస్తుందని రైతు రాములు ధీమా వ్యక్తం చేశాడు.
సాగు ఖర్చు తక్కువ..
వరి పంటకు బదులు ఇతర పంటలు వేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం చెప్పడంతో నాకున్న ఎకరం పొలంలో ఎల్లిగడ్డ పంటను సాగు చేస్తున్నా. వరి వేస్తే పెట్టుబడి ఎక్కువ, నీరు ఎక్కువగా కావాలి. దీంతో నేను ఎల్లిగడ్డను సాగు చేస్తున్నా. ఇప్పటివరకు విత్తనాలకు, పొలం దున్నడానికి, కలుపు, ఎరువులకు రూ.30 వేల పెట్టుబడి పెట్టాను. ప్రస్తుతం మార్కెట్లో ఎల్లిగడ్డకు మంచి ధర ఉండడంతో అధిక లాభాలు వస్తాయి. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు పొందాలంటే ఎనుకటి ఎవుసాలే మంచివి.