
నిజాంపేట, నవంబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు వరి పంటకు ప్రత్యామ్నాయంగా వివిధ రకాల పంటలను సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ యేడాది అధిక వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు అలుగు పారాయి. ఇప్పుడిప్పుడే రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంభిస్తున్నారు. నీటి వనరులు అందుబాటులో ఉన్న వారు వార్షిక పంటైన చెరుకును సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పండించిన చెరుకును గతంలో పరిశ్రమలకు తరలించాలంటే చాలా కష్టమైన పనిగా ఉండేది. శాస్త్రీయ పరిజ్ఞానం పెరిగిన కొద్ది యంత్రాల సాయంతో వ్యవసాయంలో పెనుమార్పులు సంభవించాయి. కూలీల కొరత, సరైన సమయంలో చెరుకు కోత ప్రక్రియ జరుగక ఆలస్యమవడంతో రైతులకు నష్టం జరిగేది. ఈ సమస్యను అధిగమించడానికి రోజుకు 8-10 ఎకరాల్లో చెరుకు పంటను కోసే యంత్రం అందుబాటులోకి వచ్చింది. చెరుకును కోసేందుకు కూలీలకు టన్నుకు రూ.1,000 చెల్లించగా, యంత్రం ద్వారా కోసేందుకు టన్నుకు రూ.600 చెల్లిస్తుండటంతో రైతులు ఎక్కువగా చెరుకు కోత యంత్రానికే మొగ్గు చూపుతున్నారు. దీంతో సమయం, కలిసి వస్తుంది. డబ్బులు ఆదా అవుతున్నాయి.
నిజాంపేటకు చెందిన రైతులు సుధాకర్, అశోక్ తమ పొలాలతో పాటు ఓ వ్యక్తి నుంచి కౌలుకు తీసుకున్న భూమిలో గత యేడాది నుంచి 6 ఎకరాల్లో చెరుకు పంట సాగు చేస్తున్నారు. కాగా, నవంబర్ నెల వరకు చెరుకు ఏపుగా పెరిగి కోతకు వచ్చింది. కూలీల కొరత ఉన్న ఈ సమయంలో వారిద్దరూ 198 హెచ్పీ సామర్థ్యం కలిగిన చెరుకు కోత యంత్రాన్ని ఆశ్రయించారు. మొదటగా ఈ యంత్రం చెరుకు గడలను ముక్కలుగా చేసి లిఫ్టింగ్ ట్రాక్టర్లోకి వేస్తుంది. ఆ తర్వాత ట్రాక్టర్లు వాటిని లారీల్లో నింపి ఫ్యాక్టరీకి తరలిస్తారు. చెరుకు గడలు ముక్కలు చేయడంతో అధిక బరువుతో పాటు చక్కెర అధికంగా ఉంటుంది. మిగిలిన చెరుకు ఆకులు, వ్యర్థ పదార్థాలు భూమి అడుగు భాగాన పడి కుళ్లిపోయి తరువాత పంటకు ఎరువుగా ఉపయోగపడుతుంది.
డబ్బు, సమయం ఆదా..
నాకున్న వ్యవసాయ భూమిలో 3 ఎకరాల్లో చెరుకు పంటను సాగు చేస్తున్నాను. చెరుకు కోత యంత్రాన్ని ఆశ్రయించడంతో తక్కువ సమయం, ఖర్చుతో పాటు సరైన సమయంలో పంటకోతలు జరిగాయి. ఇటువంటి ఆధునిక యంత్రాలతో వ్యవసాయం చేయడం సులభతరం.