
మెదక్, నవంబర్ 14 : మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీ పడుతున్నారు. మెదక్ జిల్లా పరిధిలోని 49 మద్యం షాప్‌లకు గాను శనివారం వరకు 64 దరఖాస్తులు వచ్చాయి. మరో నాలుగు రోజులు గడువు ఉన్నది. ఈ నేపథ్యంలో మద్యం షాప్‌లకు మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మద్యం దుకాణాలకు గతంతో పోలిస్తే ఈ ఏడాది దరఖాస్తులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. మద్యం వ్యాపారులకు వెసులుబాటు కల్పిస్తూ నూతన పాలసీలో ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈఎండీ రద్దుతో పాటు లైసెన్స్ ఫీజును ఆరు స్లాబ్‌ల్లో చెల్లించుకునేలా అవకాశం కల్పించింది. దరఖాస్తు ఫీజు గతంలో మాదిరిగా ఈసారి కూడా రూ.2 లక్షలు నిర్ణయించింది. ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభమైన మద్యం టెండర్ల ప్రక్రియ మెదక్ జిల్లాలో కొనసాగుతున్నది. మద్యం పాలసీ గడువు అక్టోబర్ 30కి ముగిసింది. నూతన పాలసీని రూపొందించడం కోసం ప్రభుత్వం పాత దుకాణాలను నవంబర్ 30 వరకు పొడిగించింది. కొత్త మద్యం పాలసీ ప్రకారం ఈనెల 18వ తేదీతో దరఖాస్తుల గడువు ముగియనుంది. 19న అధికారులు దరఖాస్తులను పరిశీలించి 20న మెదక్ కలెక్టరేట్లో కలెక్టర్ హరీశ్ నేతృత్వంలో దుకాణాలను డ్రా ద్వారా వ్యాపారులకు కేటాయించనున్నారు. జిల్లాలో గతంలో 38 మద్యం దుకాణాలు ఉండగా, ఈసారి మరో 11 దుకాణాలు నూతనంగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్ల ప్రకారం 16 దుకాణాలు కేటయించగా.. అందులో గౌడలకు 9, ఎస్సీలకు 6, ఎస్టీలకు 1 దుకాణాన్ని కేటాయించారు. జిల్లావ్యాప్తంగా 49 మద్యం దుకాణాలకు గాను శనివారం వరకు 64 దరఖాస్తులు వచ్చాయి.
నూతన పాలసీతో కొత్త ఉత్సాహం..
నూతన మద్యం పాలసీ ప్రకారం 2021-23 సంవత్సరాలకు గాను మెదక్ జిల్లాలో 49 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్‌ను జారీచేసింది. ఈనెల 9 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలో 64 దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 18 వరకే దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉన్నందున ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. చివరి రోజు 18న గురువారం మంచిరోజు కావడంతో ఆ రోజు మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈసారి అనేక మంది దరఖాస్తు చేసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే మద్యం వ్యాపారాల్లో ఉన్న వారితో పాటు ఇతరత్రా వ్యాపారాలు చేస్తున్నవారు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు చెందిన వారు కూడా మెదక్ జిల్లాలో మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు…
దరఖాస్తు ఫీజును రూ.2 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. లాటరీలో పేరు రాకపోతే తిరిగి ఈ డబ్బు చెల్లించరు. ఒక దరఖాస్తుదారుడు ఒక దుకాణానికి ఎన్ని దరఖాస్తులైనా చేయవచ్చు. ఈ సంవత్సరానికి మద్యం దుకాణ ఎక్సైజ్ సుంకాన్ని ఆరు వాయిదాల్లో చెల్లించవచ్చు. అంతేకాకుండా మద్యం దుకాణ వార్షిక టర్నోవర్ ట్యాక్స్‌ని 10రెట్లకు పెంచారు. 10 రెట్లు దాటిన ఎడల లాభ శాతాన్ని 6.4 శాతం నుంచి 10 శాతానికి పెంచారు. ఎక్సైజ్ ట్యాక్స్ బ్యాంకు గ్యారంటీ రుసుం 25శాతం మాత్రమే అంటే రూ.50 లక్షల ఎక్సైజ్ ట్యాక్స్‌కి రూ.12.50 లక్షలకు నిర్ణయించారు. పర్మిట్ రూమ్‌కు ఎలాంటి అదనపు రుసుం లేదు. మద్యం దుకాణాలను వాక్ ఇన్ స్టోర్‌గా రూ.5 లక్షల రుసుం చెల్లించి అదనంగా ఏర్పాటు చేసుకోవచ్చు.
ముహూర్తం చూసుకొని దరఖాస్తులు…
మద్యం దుకాణాలకు దరఖాస్తులు దాఖలు చేసుకునే వారు ముహూర్తాలను చూసుకొని దరఖాస్తులు అందజేస్తున్నారు. దరఖాస్తు ఫారాలను వారికిష్టమైన దేవుడి దగ్గర ఉంచి పూజలు నిర్వహించిన తర్వాతనే ఎక్సైజ్ కార్యాలయాలకు వెళ్తున్నారు. కొందరైతే తమ కిష్టమైన వారి చేతుల మీదుగా దరఖాస్తు ఫారాలను అందచేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మరికొంత మంది వారి కుటుంబంలోని మహిళల పేరు మీద
దరఖాస్తులు అందజేస్తున్నారు.
కొత్త మద్యం పాలసీలో వెసులుబాటు..
కొత్త మద్యం పాలసీలో వ్యాపారులకు వెసు లుబాటు కల్పించే విధంగా ప్రభుత్వం మా ర్పులు చేసింది. జిల్లాలో గతంలో 38 దుకాణాలు ఉండగా, ఈసారి కొత్తగా 11 మంజూరయ్యాయి. ఈ సంవత్సరానికి మ ద్యం దుకాణ ఎక్సైజ్ సుంకాన్ని ఆరు వా యిదాల్లో చెల్లించవచ్చు. జిల్లాలో శనివారం వరకు 64 దరఖా స్తులు అందాయి. అందులో 13 మంది మహిళల పేర్ల మీద దరఖాస్తులు వచ్చాయి.
-ఎంఏ రజాక్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మెదక్