సంగారెడ్డి అర్బన్, మే 29: జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆశ్రమంలో శిలా ప్రక్షేపణ సేవా మహోత్సవం ఆదివారం వైభవంగా సాగింది. ఫసల్వాదీ శివారులోని కైలాస ప్రస్తార మహా మేరు పంచముఖ ఉమామహేశ్వరస్వామి ఆలయ నిర్మాణంలో భక్తులు పాలుపంచుకునే అవకాశం కల్పించారు.
భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని 27 అడుగుల ఎత్తుపైనున్న దేవాలయంపైకి శిలలను మోసుకెళ్లారు. జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకుడు మహేశ్వరశర్మ సిద్ధాంతి సమక్షంలో భక్తులు భజనలు చేస్తూ సేవలో పాల్గొన్నారు. సుమారు 10వేల పై చిలుకు శిలలను భక్తులు ఆలయం పైకి చేర్చారు. ఈ సందర్భంగా మహేశ్వరశర్మ సిద్ధాంతి మాట్లాడుతూ మహా మేరు ఆలయ నిర్మాణంలో శారీరక సేవ చేయడం పూర్వ పుణ్యఫలమన్నారు. ఒక్కో శిల 8కిలోల బరువు ఉంటుందని పేర్కొన్నారు.