
వర్గల్, నవంబర్ 14 : వర్గల్ ప్రసిద్ధ ఆలయాలైన నాచగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవాలయం, వర్గల్ విద్యాదరి సరస్వతీ అమ్మవారి క్షేత్రాలు ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. కార్తీకమాసం అందులోనూ సెలవు కావడంతో భక్తులు దేవతామూర్తుల దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్తీక పంచమి తిథి కావడంతో వర్గల్ విద్యాదరి క్షేత్రంలో చిన్నారులకు పెద్ద ఎత్తున అక్షరాభ్యాసం చేయించారు. నాచగిరి ఆలయంలో కుటుంబ సమేతంగా సత్యనారాయణ వ్రతాలు ఆచరించారు. ఆలయాల నిర్వాహకులు భక్తుల ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, నాచగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగే పులిహోర ప్యాకెట్ల తయారీ కోసం రూ.1.35 లక్షల విలువైన ప్యాకింగ్ మిషన్‌ను టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నాచగిరిక్షేత్రం మాజీ ట్రస్ట్‌బోర్డు చైర్మన్ కొట్టాల యాదగిరి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ హనుమంతరావు మాట్లాడారు. గతంలో చైర్మన్‌గా విధులు నిర్వహించిన కొట్టాల యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారిపై ఉన్న అపార భక్తిభావంతో పులిహోర ప్యాకింగ్ మిషన్‌ను అందజేయడం స్ఫూర్తిదాయకమని తెలిపారు. పూజా కార్యక్రమాల్లో ధర్మకర్తల మండలి సభ్యులు నంగనూరి సత్యనారాయణ, లచ్చగౌని రాములు గౌడ్, చంద్రారెడ్డి, పడిగెరాజు ఆలయ సిబ్బంది సుధాకర్ గౌడ్, పాండు, సంపత్, నరేందర్ గౌడ్, రవి పాల్గొన్నారు.