బ్యాంకు లింకేజీ రుణాలు మహిళా స్వయం సహాయక సంఘాలకు జవసత్వాలు ఇస్తున్నాయి. మహిళలు తమకు నచ్చిన వ్యాపారం చేసుకుని సొంత కాళ్లపై నిలబడి ఆర్థికాభివృద్ధి సాధించేందుకు దోహదపడుతున్నాయి. వాయిదాలను సకాలంలో చెల్లిస్తుండడంతో బ్యాంకులు సైతం లోన్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. గత సంవత్సరం బ్యాంకులు రూ. 672 కోట్లు మంజూరు చేయడంతో రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరం 16,503 గ్రూపులకు రూ. 700కోట్లు ఇప్పించాలని డీఆర్డీవో అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మండలాల వారీగా లక్ష్యాలను నిర్దేశించి వందశాతం టార్గెట్ పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే నెల నుంచి అర్హులైన సంఘాలకు రుణాలు మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభం కానుండగా, త్వరలోనే బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి మూడు నెలలకొకసారి రుణ పంపిణీపై సమీక్ష నిర్వహించి లక్ష్యాన్ని చేరుకునేలా దిశానిర్దేశం చేయనున్నారు.
సంగారెడ్డి, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. మహిళలకు స్త్రీనిధి, బ్యాంకు లింకేజీల ద్వారా రుణాలు అందజేసి వారు ఆర్థిక బలపడేలా చర్యలు చేపట్టింది. ఎస్‌హెచ్‌జీ ద్వారా మహిళలు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తుండటంతో బ్యాంకర్లు మహిళలకు రుణాలు ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు. మహిళ గ్రూపులు వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా బలపడేందుకు బ్యాంకు లింకేజీ రుణాలు అందజేస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, అధికారులు మహిళా గ్రూపులకు సకాలంలో వారు కోరినంత రుణం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోనే అత్యధికంగా రూ. 672కోట్ల రుణా లు అందజేసింది. సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్స రం 2022-23లో 16,503 మహిళా సంఘాలకు రూ.700 కోట్ల రుణాలు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా స్థాయిలో తమకు కేటాయించిన లక్ష్యాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు మండలాల వారి గా లక్ష్యాలను నిర్దేశించుకుని ఈ ఏడాది మహిళా గ్రూపులకు వందశాతం రుణాలు అందించేందుకు సిద్ధం అవుతున్నారు.
సంగారెడ్డి జిల్లాలో రెండు సంవత్సరాలుగా మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చేయటంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సైతం లక్ష్యానికి మించి రుణాలు ఇచ్చే దిశగా డీఆర్డీఏ అధికారులు రుణ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పడిన మహిళా సంఘాలతో పాటు ఇది వరకు ఉన్న సంఘాలకు సైతం బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు ఇవ్వనున్నారు. కొత్త గా ఏర్పడిన మహిళా సంఘాలకు రూ. 50వేలు రుణాలు అందజేస్తారు. ఆ తర్వాత లక్ష రూపాయల నుంచి రూ. 20లక్షల వరకు బ్యాంకు రుణాలను మహిళా సంఘాలకు అందజేస్తామన్నారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న మహిళా సంఘాలు వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగటంతో పాటు రుణాలను వెనువెంటనే చెల్లిస్తున్నారు. జిల్లాలో మహిళా సంఘాలు అన్ని రకాల వ్యాపారాలతో పాటు ఎక్కువగా డెయిరీ, వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు చేస్తున్నారు. మ హిళా సంఘాల సభ్యులు సకాలంలో రుణాలు చెల్లిస్తుండటంతో బ్యాంకర్లు రుణా లు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.
లక్ష్యం మేరకు రుణాలు పంపిణీ
– శ్రీనివాస్‌రావు, డీఆర్డీవో
ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 16,503 మహిళా సంఘాలకు రూ. 700కోట్ల రుణాలు పం పిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా ము. రెండేళ్లుగా సంగారెడ్డి జిల్లా మహిళా సంఘాలకు బ్యాంకు రు ణాల పంపిణీలో రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉంది. ఈ ఏడాది రూ. 700కోట్లకు మించి మహిళా సంఘాలకు రుణాలు అందజేస్తామన్న నమ్మకం ఉంది. ఈ మేరకు రుణ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాము. మండలాల వారిగా లక్ష్యాలను నిర్ధేశించుకుని త్వరలోనే అర్హులైన సంఘాలకు రుణాలు మంజూరు చేస్తాము. జిల్లాలోని బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి లక్ష్యానికి అనుగుణంగా రుణాలు మంజూరు చేయాలని కోరుతాము. సంఘాలకు రుణాల పంపిణీపై కలెక్టర్ మూడు మాసాలకు ఒకమారు సమీక్ష జరుపుతారు.