దుబ్బాక, ఏప్రిల్ 28 : ‘దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతీ పేదింటి ఆడబిడ్డ పెండ్లికి లక్షా నూట పదహారు రూపాయలు అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది.. కులమతాలకతీతంగా ఆడపిల్ల పెండ్లికి ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు చేయలేని పనులు మన సీఎం కేసీఆర్ చేసి చూపిస్తున్నారు. హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా ఆడిపిల్లల తల్లులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు’.. అని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం దుబ్బాక బాలాజీ ఫంక్షన్హాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధ్దిదారులకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు చెక్కులు పంపిణీ చేశారు.
దుబ్బాక నియోజకవర్గంలో 195మందికి కల్యాణలక్ష్మి, 194మందికి షాదీముబారక్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రతి పేదింటి ఆడబిడ్డల పెండ్లికి మేనమామ లెక్క అండగా ఉంటూ మొదటి కాన్పునకు సర్కారు దవాఖానకు వస్తే రూ.12 వేలు, కేసీఆర్ కిట్ అందించి, ఆటో కిరాయి లేకుండా పుట్టిన బిడ్డను, తల్లిని ఇంటి వరకు తీసుకెళ్లేందుకు వాహన సౌకర్యం ప్రభుత్వమే కల్పిస్తున్నదన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీలు చేయలేని పనులు సీఎం కేసీఆర్ చేశారని తెలిపారు.
తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో రకల పథకాలను తెచ్చిన సర్కారు కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. సభలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులు మహిళలే కాబట్టి, మీ పిల్లలను సర్కారు దవాఖానలో మాత్రమే చూపించాలని కోరారు. ప్రైవేటు దవాఖానలకు వెళ్లి డబ్బులు దండుగ చేసుకోవద్దని సూచించారు. చాలా మంది నార్మల్ డెలవరీలకు కాకుండా ఆపరేషన్లను ప్రోత్సహించడం సరైంది కాదన్నారు. సర్కారు దవాఖానలో తల్లీబిడ్డల సంరక్షణ కోసం వైద్య సిబ్బంది ప్రత్యేక కృషి ఉంటుందన్నారు. మన ఇంటి కోడి పప్పుతో సమానం అన్న చందంగా సర్కారు దవాఖానలో మెరుగైన వైద్య వసతులను చిన్నచూపు చూడడం సరికాదన్నారు.
ప్రైవేటు దవాఖానల్లో కాన్పులకు తీసుకెళ్లి లక్షల రూపాయలు దుర్వినియోగం చేసుకోవడం సరికాదని సూచించారు. నార్మల్ డెలివరితోనే తల్లులకు ముర్రు పాలు వస్తాయని, అమృతం లాంటి ముర్రుపాలతోనే శిశువు ఆరోగ్యంగా ఉంటుందన్నారు. కల్యాణలక్ష్మి చెక్కులు తీసుకుంటున్న తల్లులు, తమ పిల్లల కాన్పు కోసం సర్కారు దవాఖానలోనే చేయించాలని కోరారు. గర్భిణులు నాలుగు సార్లు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఐరన్ టాబ్లెట్స్ తప్పకుండా తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసమే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా తన తండ్లాట అని పేర్కొన్నారు.
మేనమామగా.. : మెదక్ ఎంపీ
ఆడబిడ్డ పెండ్లి అంటే ఎంతో కష్టంగా ఉంటుందని, పేదలు తమ బిడ్డ పెండ్లి చేసేందుకు నానా ఇబ్బంది పడుతుంటారని, వారి బాధలు తెలుసు కాబట్టే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ప్రవేశ పెట్టారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టారన్నారు. మన తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు కేంద్రం ప్రకటించిన అన్ని అవార్డులను సొంతం చేసుకున్నామని తెలిపారు. దేశమే తెలంగాణను ఆదర్శంగా తీసుకొని, పలు పథకాలను అమలు చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనితారెడ్డి, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో అనంతరెడ్డి దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.