మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 28 : పది, ఇంటర్ పరీక్షల ను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేలా పటి ష్ట చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మెదక్ కలెక్టర్ మేడ్చల్ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనగా, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండు సంవత్సరాలు కరోనా కారణంగా వార్షిక పరీక్షలు నిర్వహించలేదని, ఈ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. కాగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు దిశ నిర్దేశం చేశారు. వేసవి ఉష్ణోగ్రతలు అధికం అవుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూ తాగునీరు, రవాణా, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే 1800-599-9333 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలన్నారు.
పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తాం..
– జిల్లా కలెక్టర్ హరీశ్
జిల్లాలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హరీశ్ తెలిపారు.
జిల్లాలో 11,399 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారని, ఇందుకోసం 73 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రికి వివరించారు. అలాగే ఇంటర్ విద్యార్థులు 13,777మంది ఉన్నారని వీరి కోసం 31పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి సూచనలు చేశామని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకునేలా బస్సులను నడుపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. పరీక్షల సమయంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులకు సూచించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తుతో పాటు 144 సెక్షన్ అమలు చేస్తామని మంత్రికి చెప్పారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రితో పాటు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కమిషనర్ దేవసేన, స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఎస్పీ సైదులు, జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్, ఇంటర్ నోడల్ అధికారి సత్యనారాయణతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.