సంగారెడ్డి కలెక్టరేట్/ మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 23: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు (1 నుంచి 9వ తరగతి వరకు) నేటి నుంచి వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. చివరి రోజు శనివారం విద్యార్థులకు ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. ఏప్రిల్ 23 నుంచి జూన్ 11 వరకు సెలవులని, తిరిగి జూన్ 12న పాఠశాలలు ప్రారంభమవుతాయిని విద్యాధికారులు తెలిపారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 965 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ప్రైవేటు పాఠశాలలు 80 వరకు ఉన్నాయి. రెండేండ్ల అనంతరం ఈసారి పుస్తకాలతో కుస్తిపట్టిన విద్యార్థులు వేసవి సెలవులు రావడంతో ఆనందంగా ఇంటిబాట పట్టారు. సెలవుల నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలు తరగతులు నిర్వహిస్తే యాజమాన్యాలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు. జూన్ 2న ఆవిర్భావ దినోత్సవం, జూన్‌లోనే 5 రోజుల పాటు బడిబాట కార్యక్రమాలు చేపట్టనున్నారు.
సెలవుల్లో సేద తీరుతూ..
నిత్యం పాఠశాలకు వెళ్లి పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులకు వేసవి సెలవులు ఒక ఆట విడుపు. పుస్తకాలు, యూనిఫాం, లంచ్‌బాక్స్ పక్కన పెట్టి నచ్చిన మిత్రులతో మెచ్చిన ఆటలు ఆడుకోవడంలో ఆ మజానే వేరు. చదువు జ్ఞానాన్ని ఇస్తే ఆటలు ఉల్లాసాన్ని, ఉత్సాహన్ని ఇస్తాయి.
సంగారెడ్డిలో..
నిత్యం పుస్తకాల బ్యాగులు మోసిన విద్యార్థులకు సెలవులు లభించడంతో వారి సంతోషానికి అవధుల్లేవు. సంగారెడ్డి జిల్లాలో దాదాపు 1800 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో సుమారు రెండున్నర లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారందరికీ వేసవి సెలవులు రావడంతో, ముఖ్యంగా అంగన్వాడీలు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు మూతపడనున్నాయి. ఉన్నత పాఠశాలల్లో మాత్రం పదో తరగతి విద్యార్థులకు యథావిధిగా ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.
ఎండలో తిరగవద్దు
వేసవి సెలవులు వచ్చినందున విద్యార్థులు ఎండలో తిరగొద్దు. వేసవి తాపానికి కొందరు విద్యార్థులు చెరువులు, కుంటల వైపు వెళ్తుంటారు. అలాంటి వారిపై తల్లిదండ్రులు దృష్టి సారించాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో విద్యార్థులు ఇంటి పట్టునే ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. పదో తరగతి విద్యార్థులకు మాత్రం ప్రత్యేక బోధన కొనసాగుతున్నది. పరీక్షలు ముగిసేంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
– నాంపల్లి రాజేశ్, డీఈవో, సంగారెడ్డి