మెదక్, ఏప్రిల్ 18 : మెదక్ మార్కెట్ కమిటీని అన్ని రం గాల్లో అభివృద్ధి చేస్తున్నామని మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి అన్నారు. మెదక్ పట్టణంలోని న్యూ మార్కెట్లో రైతుబజార్ నిర్మాణం పనుల పూర్తి కోసం రూ. 3.86కోట్ల నిధులు విడుదలయ్యాయని తెలిపారు. సోమవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ బట్టి జగపతి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 2022-23సంవత్సరం ఆర్థిక బడ్జెట్‌ను ప్రతిపాదించి డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ ఆమోదం కోసం పంపించామన్నారు. అనంతరం బట్టి జగపతి మాట్లాడుతూ రైతుబజార్ పెండింగ్ పనుల నిధుల కోసం మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే రూ. 4.18కోట్లు మంజూరు చేయగా, అందులో రూ. 3.86కోట్లతో రైతుబజార్ నిర్మాణాన్ని త్వరితగిన పూర్తి చేసి ఆదాయం సమకూరే దిశగా చర్యలు చేపడుతామని చెప్పారు. మార్కెట్ కమిటీయార్డు ఆవరణలో నిర్మాణం పూర్తి చేసుకున్న షాపుల్లో ఫర్టిలైజర్ దుకాణాలకు కేటాయించనున్నట్టు తీర్మానం చేశామన్నారు. మొత్తం 20దుకాణాలకు ఒక్కొక్క షాపుకు రూ. 8వేల చొప్పున కిరాయి చెల్లించాల్సి ఉంటుందన్నారు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో త్వరలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సావిత్రిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ హన్మంతరెడ్డి, మార్కెటింగ్ కార్యదర్శి ఉషా, ఏడీ విజయనిర్మల, డైరెక్టర్లు మేడిశెట్టి శంకర్, చంద్రశేఖర్‌రెడ్డి, ఇందాజ్అలీ, నర్సింహులు, సాప సాయిలు, బాలేశ్, రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు.