హత్నూర, ఏప్రిల్7: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు నిరంతరం విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారిని ఆంగ్ల మాద్యమంలో తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వ పాఠశాల అయినప్పటికీ ఉపాధ్యాయుల ప్రత్యేక కృషి, విద్యార్థుల పట్టుదలతో నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధిస్తూ అబ్బురపరుస్తున్నారు. చదువుతున్నది ప్రభుత్వ పాఠశాల అయినప్పటికీ ఫలితాల్లో మాత్రం కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది ఆపాఠశాల. హత్నూర మండలం దౌల్తాబాద్ ప్రభుత్వ పాఠశాలలో 2018 సంవత్సరం నుంచే 6వ తరగతిని ఆంగ్లమాద్యమంలో ప్రారంభించారు. అప్పటి నుంచి ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ విద్యలో రాణించేలా బోధన చేస్తున్నారు. ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశాలను శ్రద్ధగా వింటూ ఎప్పుడు పరీక్షలు నిర్వహించినా ఉత్తమ ఫలితాలు సాధించేలా కష్టపడి చదువుతున్నారు.
తాము చదువుతున్నది ప్రభుత్వ పాఠశాల అనే భావన మరిచి ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేస్తుండటంతో ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు విద్యార్థులకు వెన్నంటి ఉంటూ ప్రోత్సహిస్తున్నారు. మూడేండ్లుగా పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధిస్తూ మండలంలోనే పాఠశాల ఆదర్శంగా నిలుస్తున్నారు. 2019లో 123, 2020లో 134, 2021లో 144మంది విద్యార్థులు పదో తరగతిలో పరీక్షలు రాయగా వందశాతం ఉత్తీర్ణత సాధించారు. దీంతోపాటు మార్కుల పర్సంటేజీలు సైతం అధికంగానే ఉండడం గమనార్హం. పాఠశాలలో విద్యార్థులు సాధిస్తున్న ఫలితాలను తెలుసుకున్న పరిసర గ్రామాల విద్యార్థులు ఆ బడిలో చేరడానికి ఉత్సాహం కనబరుస్తున్నారు. దీంతో నేడు 600 మంది విద్యార్థులు పాఠశాలలో చేరి విద్యనభ్యసిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మన ఊరు-బన బడి కార్యక్రమాన్ని వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెట్టనుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
మన ఊరు- మన బడి గొప్ప కార్యక్రమం
ప్రభుత్వం మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని చేపట్టడం శుభపరిణామం. ఈ కార్యక్రమంతో పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
– శ్రీలత ఉపాధ్యాయురాలు
ఉత్తమ ఫలితాల సాధనకు కృషి
పాఠశాలలో ఉత్తమ ఫలితాల సాధనకు నిరంతరం కృషి చేస్తున్నాం. మూడేండ్లుగా పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణత సాధించడం ఆనందంగా ఉంది. నాణ్యమైన విద్యా బో ధన చేస్తుండడంతో నేడు పాఠశాలలో 600 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. దాతల సహకారంతో పలు రకాల సౌకర్యాలు ఏర్పాటుచేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.
– లక్ష్మా రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు
కార్పొరేట్‌స్థాయి విద్యాభోధన
ప్రభుత్వ పాఠశాల అయినప్పటికీ ఇక్కడ చదువు చెప్పే ఉపాధ్యాయులు కార్పొరేట్ విద్యా సంస్థల తరహాలో బోధిస్తున్నారు. దీంతో ఉత్తీర్ణతలో మండలంలోనే ఫస్టు మా స్కూలు. ప్రభుత్వం మన ఊరు- మన బడి కార్యక్రమం ప్రవేశపెట్టడంతో పేద విద్యార్థులకు మేలు కలుగుతుంది. పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి కష్టపడి చదువుతున్నాం.
– అమనోద్దిన్ 9వ తరగతి విద్యార్థి
ఉపాధ్యాయులు చక్కగా బోధిస్తున్నారు
ప్రభుత్వ పాఠశాల అయినప్పటికీ ప్రైవేటుకు దీటుగా పాఠ్యాంశాలను చక్కగా అర్థమయ్యే రీతిలో ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధగా విని ఇంగ్లిష్‌లో పట్టుసాధించడానికి కృషిచేస్తున్నా. పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్లమాద్యమం ప్రవేశపెట్టి చదువు చెప్పడం ఎంతో మేలు కలిగిస్తుంది. ఆనందంగా ఉంది.
– ఎస్.నందిని, 8వ తరగతి విద్యార్థిని