రామాయంపేట, మార్చి 26: అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ల పనులు పూర్తయ్యాయి. రైలు రాక కోసం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కృషితోనే పనులు త్వరగా పూర్తి అయ్యాయని రైల్వే ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 7 గంటల వరకు మెదక్ జిల్లా అక్కన్నపేటకు రైలు చేరుకుంది. నూతనంగా పనులు పూర్తి చేసుకున్న రైల్వే లైన్‌కు అధికారులు పూజలు చేశారు. అనంతరం ట్రయల్ రన్ నిర్వహించారు. ఇక్కడి నుంచి లక్ష్మాపూర్, శమ్నాపూర్ మీదుగా మెదక్ వరకు అధికారులు అణువణువు పరిశీలిస్తూ కదిలారు. కాగా, రైల్వే లైన్‌కు 2014లో అప్పటి కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వ ఎంపీలు వెంటపడడంతో రైల్వే లైన్‌ను మంజూరు చేసింది. 2015లో రూ.206 కోట్లను కేటాయించగా, అందులో కేంద్రం సగం, రాష్ట్ర ప్రభుత్వం సగం రూ.103 కోట్లను విడుదల చేయడంతో పనులు పూర్తయ్యాయి. రైల్వే అధికారులు ప్రత్యేక పూజలు చేసి అక్కన్నపేటలో మెదక్‌కు రైలును ప్రారంభించారు. కార్యక్రమంలో డీఆర్ఎం శరత్చంద్ర, ఇతర అధికారులున్నారు.
మెదక్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుతుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం క్యాంప్ కార్యాలయంలో జడ్పీ వైస్‌చైర్‌పర్సన్ లావణ్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అక్కన్నపేట నుంచి మెదక్‌కు 17.1 కి.మీటర్ల రైల్వే ట్రాక్‌తో పాటు మూడు స్టేషన్లలో నిర్మించిన రైల్వే పనులు పూర్తికావడంతో ట్రయల్ రన్ సైతం నిర్వహించారన్నారు. శనివారం రైల్వే ఉన్నతాధికారులు సిగ్నల్స్ వ్యవస్థతో పాటు వేగంగా ట్రయల్ రన్ నడిపి ట్రాక్‌ను పరిశీలించినట్లు పేర్కొన్నారు. రైల్వే లైన్ నిర్మాణానికి 50శాతం నిధులు రాష్ట్రం వాటాగా సీఎం కేసీఆర్ సమకూర్చారని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.203 కోట్ల నిధులు వెచ్చించాయన్నారు.
రైల్వే ట్రాక్ వలన భూములు కోల్పోయిన 900 మంది రైతుల నుంచి 371 ఎకరాల భూమిని సేకరించి రాష్ట్ర ప్రభుత్వం రూ.16.84 కోట్ల నష్టపరిహారం చెల్లించినట్లు ఆమె వెల్లడించారు. రైల్వే నిర్మాణానికి సహరించిన రైతులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. అన్ని టెస్ట్‌లు పూర్తయితే ఏప్రిల్ 1 తరువాత రైలు నడిచేవిధంగా షెడ్యూల్ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్‌లో మెదక్ నుంచి వివిధ ప్రాంతాలకు మరింత విస్తరించే విధంగా కనెక్టివిటీ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామన్నారు. సమావేశంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్ కౌన్సిలర్లు, జయరాజ్, విశ్వం, కిశోర్, పీఎసీ చైర్మన్ హనుమంత్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గంగాధర్, కృష్ణాగౌడ్ నాయకులు ఉమర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు..
ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి నూతనంగా ఏర్పాటు చేసే రథానికి ఎమ్మెల్సీ కవిత రూ.5 లక్షల విరాళం ఇవ్వడంపై ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
కంప్యూటరైజ్డ్ సిగ్నల్ వ్యవస్థ బాగుంది..
మెదక్ ప్రజల ఏండ్ల నాటి కల సాకారమవుతున్నది. త్వరలో రైల్వే సేవలు ప్రారంభం కాబోతున్నాయి. అక్కన్నపేట-మెదక్ రైల్వే పనులు పూర్తి కావడంతో శనివారం దక్షిణమధ్య రైల్వే అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ముందుగా అక్కన్నపేట నుంచి లక్ష్మాపూర్, శమ్నాపూర్ రైల్వే స్టేషన్ల మీదుగా మెదక్ వరకు రైల్వే బ్రిడ్డిలను, కల్వర్టులు, క్రాసింగ్, సిగ్నల్‌తో పాటు ట్రాక్‌ను డివిజనల్ రైల్వే మేనేజర్ శరత్ చంద్రయాన్, రైల్వే సేఫ్టీ అధికారి సువోమై మిత్రా, చీఫ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి అమిత్గోయల్ పరిశీలించారు. అనంతరం ట్రయల్ రన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మెదక్ వరకు ఎలాంటి అంతరాయం కలుగకుండా రైలు మెదక్ స్టేషన్‌కు సునాయాసంగా చేరుకుంది.
అనంతరం స్టేషన్‌లోని స్టేషన్ మాస్టర్ కార్యాలయంలోని రైల్వే కంప్యూటరైజ్డ్ సిగ్నల్ వ్యవస్థను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రైలుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, కౌన్సిలర్లు సమీయొద్దీన్, కిశోర్, ఆంజనేయులు, టీఆర్ఎస్ నాయకులు గంగాధర్, కృష్ణాగౌడ్, సాప సాయిలు తదితరులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ రైల్వే మేనేజర్ శరత్ చంద్రయాన్‌కు ఎమ్మెల్యే స్వీట్లు తినిపించారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో వచ్చే నెలలో రైళ్లు నడిపేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.