పటాన్చెరు, మార్చి 26 : అమీన్పూర్ పెద్ద చెరువు శిఖం, బఫర్‌జోన్‌లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ శాఖల అధికారులు కొరడా ఝలిపించారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు శిఖం, బఫర్‌జోన్‌లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు కడుతున్నారు. వీటిపై ఫిర్యాదులు వస్తుండటంతో ఇరిగేషన్‌శాఖ డీఈఈ రామస్వామి ఆదేశాల మేర కు ఏఈఈ ఎంబీపీ ప్రసాద్‌ల ఆధ్వర్యంలో శనివారం రెవెన్యూ శాఖ ఆర్ఐ మల్లేశం, మున్సిపాలిటీ సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందం వాణినగర్, వినాయక్‌నగర్‌లో కబ్జాలు, అక్రమ నిర్మాణాలను కూల్చడం ప్రారంభించింది. చెరువు బఫర్‌జోన్‌లో భారీ నిర్మాణం చేస్తుంటే దాన్ని కూల్చివేశారు. ఎఫ్టీఎల్లో పునాది వేసిన మరో రెండు నిర్మాణాలను జేసీబీలతో తొలగించారు.
ఈ సందర్భంగా ఒక ఇంటి యజమాని ఇరిగేషన్ అధికారులతో వాగ్వాదం చేశాడు. రెవెన్యూ అధికారులు ఏమికాదని హామీ ఇవ్వడంతోనే తాను నిర్మాణం చేస్తున్నానని తెలిపి వాగ్వాదం చేశాడు. చెరువు పరిధిలో శిఖంలో కాని, బఫర్ జోన్లో కాని నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలుంటాయని ప్రసాద్ హెచ్చరించారు. అమీన్‌ఫూర్, పటాన్చెరు, ఆర్సీపురం మండలాల్లో చెరువుల్లో ఈ మధ్య ఆక్రమణలు ఎక్కువగా జరుగుతున్నాయని ఏఈఈ తెలిపారు. త్వరలో అన్ని ఆక్రమణలను తొలిగిస్తామన్నారు. అమీన్పూర్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో మట్టితో పూడుస్తున్న వ్యక్తులు కోర్టుకు వెళ్లి అధికారులు చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నారన్నారు. నేషనల్ గ్రీ న్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయని తెలిపారు. ఎన్జీటీ స్పష్టమైన డైరెక్షన్ తెలిపిందన్నారు.
శిఖం భూముల్లో జీవో 58, 59కు అర్జీలు
అమీన్‌ఫూర్ మున్సిపాలిటీలో ఈ మధ్యకాలంలో చెరువు శిఖం లో కబ్జాలు చేసి అక్రమంగా ఇండ్లను నిర్మిస్తున్నారు. ఈ ఇండ్లకు అమీన్పూర్ పూర్వ గ్రామ పంచాయతీ కాలంలో ఇచ్చారని ఇంటి నంబర్లు వేస్తున్నారు. ఈ ఇండ్లను 58, 59 జీవోలో క్రమబద్దీకరణ చేయాలని ఆప్లికేషన్స్ వేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ము న్సిపాలిటీ, రెవెన్యూ యంత్రాంగం నుంచి మద్దతు వస్తుండటంతో ఈ వ్యవహారం జరుగుతున్నదని వాణీనగర్‌లో పలువురు బహిరంగంగా తెలిపారు. ఈ విషయంలో ఇరిగేషన్ ఏఈఈ చెరువుల్లో ఆక్రమణలకు క్రమబద్ధ్దీకరణ జరుగకుండా చూస్తామని పేర్కొన్నారు. కబ్జాలు చేస్తే కేసులు పెడుతామన్నారు.