జిన్నారం, మార్చి 26: తెలంగాణ ప్రభుత్వం గురుకులాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు అత్యుత్తమ విద్యాబోధన అందిస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. అదే కోవలో ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు – మన బడి కార్యక్రమం చేపట్టి విప్లవాత్మక మా ర్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. జిన్నారంలోని గిరిజన గురుకుల పాఠశాలలో కెఫిన్ టెక్ టెక్నాలజీస్ సంస్థ రూ.66 లక్షలతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంటు, కం ప్యూటర్ ల్యాబ్, సీసీ కెమెరాలు, సాఫ్ట్ బోర్డు, డిజిటల్ తరగతులను సంస్థ ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేసేందుకు సహకరించడం అభినందనీయమన్నారు. కెఫిన్ టెక్ టెక్నాలజీస్ సంస్థ గురుకుల పాఠశాలలో రూ.66 లక్షల వ్యయంతో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం గొప్ప విషయమన్నారు. గిరిజన గురుకుల పాఠశాలలో చదివి, ఉత్తమ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న తొమ్మిది మంది విద్యార్థులకు రూ.16 లక్షల ఉపకార వేతనాలు అందజేశారు.
కార్పొరేట్‌కు దీటుగా వసతులు
ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కారు అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 123 గురుకులాలు ప్రారంభించి కేజీ టు పీజీ వరకు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఉచిత విద్యను అందిస్తున్నారన్నారు. కెఫిన్ టెక్ టెక్నాలజీస్ స్ఫూర్తితో నియోజకవర్గంలోని పాఠశాలల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు ముందుకు రావాలన్నారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్, కెఫిన్ టెక్ టెక్నాలజీస్ సంస్థ సీఈవో శ్రీకాంత్ నాదెళ్ల, టెక్నాలజీస్ అండ్ ఆపరేషన్ చీఫ్ సతీశ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చేతన, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజీవ్, ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ స్వరూప్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్, గురుకుల ప్రిన్సిపాల్ సుమ పాల్గొన్నారు.
ఉస్మాన్‌నగర్‌లో అదనపు తరగతి గదులు ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీలోని ఉస్మాన్‌నగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఫ్రాంక్లిన్ టెంప్లిటొన్ రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ సహకారంతో రూ.14 లక్షలతో నిర్మించిన రెండు తరగతి గదులను మున్సిపల్ చైర్పర్సన్ లలితాసోమిరెడ్డి, కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్లతో కలిసి ఎమ్మె ల్యే ప్రారంభించారు. మన ఊరు..మన బడితో ప్రభు త్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాములుగౌడ్, ఏఎంసీ వైస్‌చైర్మన్ మల్లారెడ్డి, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు దేవేందర్‌యాదవ్, కౌన్సిలర్లు బాబ్జీ, శ్రీశైలం, నాగరాజు, రవీందర్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యులు శ్రీపాల్‌రెడ్డి, జయలక్ష్మి, మాజీ సర్పంచ్ రామేశ్వర్, ఫ్రాంక్లిన్ టెంప్లిటొన్ సంస్థ చైర్మన్ రామకృష్ణ, ప్రతినిధులు గౌరవ్గర్గ్, సురేశ్ వేదగిరి, నాగలక్ష్మి, నిర్మల, సందీప్, రమణ, వసంత్‌కుమార్ పాల్గొన్నారు.