జీప్లస్ 2 భవన నిర్మాణాలకే అనుమతులు
జాబ్‌కార్డు ఉన్న ప్రతిఒక్కరికీ వంద రోజుల పనిదినాలు
మెదక్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్, మార్చి 25: నిత్యం ప్రజలతో మమేకమై, గ్రామాభివృద్ధికి పాటు పడే పంచాయతీ కార్యదర్శులకు బీమా సౌకర్యం కల్పించనున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో పల్లెప్రగతి, పారిశుద్ధ్యం తదితర అంశాలపై మెదక్ డివిజన్‌కు సంబంధించిన మండల పరిషత్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులకు ధీమా, రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈ నెలాఖరు నాటికి బీమా సౌకర్యం కల్పించేందుకు విధివిధానాలు రూపొందిస్తున్నామని అన్నారు. ఎండాకాలంలో తీవ్ర ఉష్ణోగ్రతలు ఉంటున్నందున హరితహారం మొక్కలు ఎండిపోకుండా ట్యాంకర్లతో నీళ్లు పోయాలన్నారు. టీ-క్యాప్ పద్ధతిలో ఒకేసారి మూడు మొక్కలకు నీళ్లు అందించవచ్చన్నారు. 530 నివాస ప్రాంతాల్లోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను ప్రతి రోజూ పారిశుద్ధ్య కార్మికులు శుభ్రపరుస్తూ, విధిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంతకాలు తీసుకోవాలన్నారు.
పాఠశాలలున్న ప్రాంతాల్లో ఎంతమంది కార్మికులతో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారో శనివారంలోగా నివేదికలు అందజేయాలని ఎంపీడీవోలకు సూచించారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ వంద రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. గ్రామాల్లో పనులు చేపట్టి రోజుకు 50 మందికి పైగా కూలీలకు పని కల్పిస్తూ, రూ.245 కూలి అందించేలా చూడాలన్నారు. గ్రామాల్లో 300 చదరపు మీటర్లలో జీప్లస్ 2 వరకు భవన నిర్మాణాలు చేసేందుకే అనుమతులు ఇవ్వడానికి అధికారాలున్నాయని, అంతకు మించి అనుమతి లేకుండా నిర్మిస్తున్న వాటికి నోటీసులు ఇచ్చి కూల్చేయాలని సూచించారు. ఏప్రిల్ నుంచి విధిగా గ్రీన్ ఫండ్ వసూలు చేయాలని, ట్రేడ్ లైసెన్స్‌దారులు, నిర్మాణ రంగాల పనులపై పన్ను వసూలు చేసి ప్రభుత్వ ఖాతాలో జమ చేయాల్సిందిగా సూచించారు. సెల్ టవర్ యాజమాన్యాల నుంచి ఫీజులు వసూలు చేయాల్సిందిగా తెలిపారు.
అటవీని అభివృద్ధి చేయాలి
మెదక్ మున్సిపాలిటీ, మార్చి 25: అటవీ అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఏఎస్-ఎయిడ్), కేంద్ర పర్యావరణ అటవీశాఖ సంయుక్తంగా ఫారెస్ట్ ప్లస్ 2.0 కార్యక్రమాన్ని 2018 డిసెంబర్ నుంచి అమలు చేస్తున్నది. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో యూఏఎస్-ఎయిడ్ రూపొందించిన నూతన సాఫ్ట్ వేర్ సపోర్ట్ సిస్టం గురించి మాట్లాడారు. ఈ సిస్టం ద్వారా రైతులు, వివిధ సంస్థ లు, శాఖలు తమ వ్యవసాయ క్షేత్రాలు, భూముల్లో ఏ మొక్కలు వేయాలి, ఏయే పంటలు పండించాలో జీపీఎస్ సిస్టంతో సులభంగా తెలుస్తుందన్నారు.
మొబైల్లో ఈ టూల్ ఓపెన్ చేసి అందులో ఎంచుకున్న ప్రాంతానికి ఒక లైన్ గీస్తే అందులో ఏ మొక్కలు పెంచడానికి అవకాశముందో చెబుతుందన్నారు. త్వరలోనే జిల్లాలో ఈ టూల్‌ను ప్రారంభిస్తామన్నారు. ఈ టూల్ నిర్వహణపై వ్యవసాయ, ఉద్యాన, గ్రామీణాభివృద్ధి సంస్థ, మత్య్స శాఖల అధికారులకు ఏప్రిల్ మొదటి వారంలో శిక్షణ ఇస్తామన్నారు. ఫారెస్ట్ ప్లస్ ప్రాంతీయ సంచాలకులు శైలుతో పాటు వారి బృందాలు అంకిత్రావత్, అతీశ్ఖాన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో డీఆర్డీవో శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్‌కుమార్, డివిజినల్ పంచాయతీ అధికారులు, జిల్లా వ్యవసాయధికారి పరశురామ్‌నాయక్, ఫారెస్ట్ రేంజ్ అధికారి మనోజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.