వనదుర్గా ప్రాజెక్టు ఎత్తు పెంపు భూసేకరణలో రైతులకు రూ.8.10 కోట్లు విడుదల చేసిన సర్కారు
త్వరితగతిన పూర్తికానున్న ప్రాజెక్టు ఎత్తు పెంపు పనులు
టీఆర్ఎస్ మెదక్ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
మెదక్, మార్చి 25: వనదుర్గా ప్రాజెక్టు ఆనకట్ట ఎత్తు పెంపు కోసం సేకరించిన భూసేకరణ రైతులకు నష్టపరిహారం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.8.10 కోట్లు విడుదల చేసిందని టీఆర్ఎస్ మెదక్ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆమె ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ 115 ఏండ్ల చరిత్ర కలిగిన ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంచేందుకు 2014 డిసెంబర్ 17న సీఎం కేసీఆర్ ఘనపూర్ ఆనకట్టను సందర్శించి హెలికాప్టర్ ద్వారా వివాంగ వీక్షణం చేసిన సందర్భంలో రూ.50 కోట్లు మంజూరు చేస్తానని ప్రకటించారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఆనకట్ట ఎత్తు పెంపునకు రూ.43.64 కోట్లు మంజూరు చేశారన్నారు. కొల్చారం, పాపన్నపేట మండలాలకు సంబంధించి 190 ఎకరాలు అవసరం కాగా, భూ సేకరణకు రూ.13.1 కోట్లు మంజూరయ్యాయని, పాపన్నపేట మండలంలో 120 ఎకరాల భూ సేకరణ పూర్తి కాగా, అప్పట్లో రూ.5 కోట్లు రైతులకు అందజేశామన్నారు. కొల్చారం మండలానికి సంబంధించి 70 ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉండగా, ప్రాజెక్టు ఆనకట్ట ఎత్తు పెంపునకు సేకరించిన భూ సేకరణ రైతులకు నష్టపరిహారం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.8.10 కోట్లు విడుదల చేసిందని పేర్కొన్నారు. ప్రాజెక్టు ఎత్తు పెంచడంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి రైతులకు లబ్ధి కలుగుతుందని, ఆనకట్ట ఎత్తు పెంపుతో 30వేల ఎకరాలకు సాగునీరు అంది భూములన్నీ సస్యశ్యామలం కానున్నాయన్నారు. మహబూబ్నహార్ కెనాల్, ఫతేనహార్ కెనాళ్ల ద్వారా మెదక్, పాపన్నపేట, హవేళీఘనపూర్ మండలాల రైతన్నల వ్యవసాయ ఆయకట్టు పెరిగి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
టీఆర్ఎస్లో చేరికలు
చిన్నశంకరంపేట, మార్చి 25: మండల పరిధిలోని చందంపేట గ్రామస్తులు 100 మంది ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం టీఆర్ఎస్ పార్టీలోచేరారు. పార్టీలో చేరిన మహిళలు, యువకులకు ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజు, సర్పంచ్ శ్రీలత తదితరులున్నారు.