మన ఊరు-మన బడి’పై వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్
మెదక్ మున్సిపాలిటీ, మార్చి 25: ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో పనులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. శుక్రవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ, ఇంజినీరింగ్ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాఠశాలల్లో చేపట్టనున్న పనులపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ ‘మన ఊరు-మన బడి’లో మొదటి విడుతలో ఎంపికైన పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా అదనపు తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, ప్రహరీ వంటి పనులు చేపట్టాలని సూచించారు. పనుల అంచనాలను సిద్ధం చేసి పరిపాలనా అనుమతుల కోసం ఉపాధి హామీ పథకం సాఫ్ట్‌వేర్‌లో పొందుపర్చాలన్నారు. మన ఊరు- మనబడిలో నిర్వహించే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయాలన్నారు.
ప్రత్యేక అధికారిని నియమించాం..: కలెక్టర్ హరీశ్
‘మన ఊరు-మన బడి’కి జిల్లాలోని ప్రతి మండలానికి ప్రత్యేకాధికారిని నియమించామని మెదక్ కలెక్టర్ హరీశ్ వీడియో కాన్ఫరెన్స్‌లో సందీప్ కుమార్ సుల్తానియాకు తెలియజేశారు. మేడ్చల్ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన జిల్లాలో 314 ఎంపిక చేసి, ఇప్పటి వరకు 286 పాఠశాలలకు ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు. ప్రతిపాదనలను ఆన్లైన్లో పొందిపర్చి, పనులు ప్రారంభిస్తామన్నారు. మెదక్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా విద్యాశాఖధికారి రమేశ్‌కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.