సిద్దిపేట టౌన్, మార్చి 15 : నిరుద్యోగ యువతీ యువకుల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ సర్కారు దేశంలో ఎక్కడా లేని విధంగా స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసింది. ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ఏర్పాటైన స్టడీ సర్కిళ్లు సత్ఫలితాలనిస్తూ నిరుద్యోగుల కలలను సాకారం చేస్తున్నాయి. జిల్లా కేంద్రాలలో మాత్రమే స్టడీ సర్కిళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సిద్దిపేట జిల్లా కానప్పటికీ మంత్రి హరీశ్‌రావు నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పాత డీఈవో కార్యాలయం పక్కన సిద్దిపేట బీసీ స్టడీ సర్కిల్‌ను 2015 సెప్టెంబర్ నెలలో ప్రారంభించారు. నాటి నుంచి నిరుద్యోగ యువత ఉద్యోగాలు సాధించేందుకు ఇక్కడ ఉచిత శిక్షణ పొందుతున్నారు. ఇప్పటి వరకు బీసీ అధ్యాయన కేంద్రంలో శిక్షణ పొందిన యువత ఉద్యోగాలు సాధించి ప్రైవేటుకు దీటుగా సత్తా చాటారు. ప్రజలందరి ఆకాంక్షలు నెరవేర్చేలా ప్రభుత్వం జనరంజక పాలన అందిస్తున్నది. నిరుద్యోగుల కలలను సాకారం చేసేందుకు మరోసారి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనకు నోటిఫికేషన్ వెలువరించనున్నది. ఈ నేపథ్యంలో సిద్దిపేట బీసీ స్టడీ సర్కిల్లో అందుతున్న సేవలు, నిరుద్యోగుల కలలు సాకారం చేసేందుకు సన్నద్దమైన తీరు తదితర అంశాల కథనం.
మెరుగైన శిక్షణ.. సకల సౌకర్యాలు
సిద్దిపేట బీసీ స్టడీ సర్కిల్ అన్ని రకాల పోటీ పరీక్షలకు వేదికగా మారింది. కావాల్సిన స్టడీ మెటీరియల్‌ను అందుబాటులో ఉంచింది. ప్రత్యేకంగా లైబ్రరీలు, నిరుద్యోగ అభ్యర్థులకు కావాల్సిన వెయ్యి పుస్తకాల సమహారాన్ని సమకూర్చింది. మెరుగైన శిక్షణతో పాటు భోజన ఏర్పాటు, టీ, స్నాక్స్ అందిస్తూ వారికి బాసటగా నిలుస్తున్నది. రాష్ట్ర స్థాయి ఉద్యోగాల నుంచి అటెండర్ ఉద్యోగాల వరకు నిర్వహించే పోటీ పరీక్షలకు సిద్దిపేట స్టడీ సర్కిల్ శిక్షణ ఇవ్వనున్నది. ప్రభుత్వం కల్పించిన అన్ని అవకాశాలను నిరుద్యోగ యువత అందిపుచ్చుకుంటూ ఉద్యోగాలను కైవసం చేసుకుంటున్నారు. సిద్దిపేట బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందిన 66 మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొంది బీసీ స్టడీ సర్కిల్ సత్తాను చాటారు.
ప్రైవేటుకు దీటుగా..
బీసీ స్టడీ సర్కిల్లో ప్రైవేటుకు దీటుగా శిక్షణ అందిస్తూ మెరికల్లా తయారు చేస్తున్నారు. హైదరాబాద్ స్థాయి శిక్షణ అందిస్తున్నారు. హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండానే పీజీ, ఎంఈడీ పూర్తి చేసిన అధ్యాపకుల ద్వారా శిక్షణ కల్పిస్తున్నారు. అవసరమైతే హైదరాబాద్ నుంచి నైపుణ్యం కలిగిన అధ్యాపకులను తీసుకవచ్చి శిక్షణ ఇస్తున్నారు. సిద్దిపేట జిల్లాతో పాటు సరిహద్దు జిల్లాలోని యువతీ యువకులకు ప్రత్యేకంగా వసతి కల్పిస్తూ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందుతున్నారు.
25 రకాల పోటీ పరీక్షలకు..
సిద్దిపేట బీసీ స్టడీ సర్కిల్ నిరుద్యోగుల పాలిట వరంగా మారింది. ప్రభుత్వం వెలువరించే అన్ని రకాల పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే వేదికైంది. పోలీసు కానిస్టేబుల్, పంచాయతీ కార్యదర్శి, బ్యాంకు క్లర్క్, టీఆర్టీ, డీఎస్సీ, వీఆర్వో, వీఆర్ఏ, ఫారెస్టు బీట్ ఆఫీసర్స్, గ్రూపు 1,2,4, ఆర్ఆర్బీ ఇలా 25 రకాల పోటీ పరీక్షలకు శిక్షణ అందించింది. 2500 మంది వివిధ పోటీ పరీక్షలకు ఇక్కడ శిక్షణ పొందారు. 66 మంది ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. 2 జాబ్ మేళాలను శిక్షణా శిబిరంలో నిర్వహించి 130 మందికి వివిధ కంపెనీలలో ఉద్యోగాలను కల్పించింది. అదే విధంగా శిక్షణ పొందిన అభ్యర్థులు కాంట్రాక్ట్, ఔవుట్ సోర్సింగ్, ప్రైవేటు రంగాల్లో 300 మంది ఉద్యోగాలను కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా రోహిణి సివిల్ కానిస్టేబుల్‌కు శిక్షణ పొంది ఉద్యోగం సాధించారు. తర్వాత గ్రూపు-2 ఉద్యోగానికి ప్రిపేరై ఆర్ఎస్సై ఉద్యోగాన్ని పొందింది. సుమారు ప్రభుత్వం నిర్వహించిన వివిధ పోటీ పరీక్షల్లో స్టడీ సర్కిల్లో శిక్షణ పొందిన 20 శాతం అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారు.
ఉత్తమ ప్రమాణాలతో శిక్షణ
సిద్దిపేట బీసీ స్టడీ సర్కిల్ నిరుద్యోగులకు ఉద్యోగ సాధనకు సోపానంగా మారింది. ఉత్తమ ప్రమాణాలతో కూడిన శిక్షణ అందిస్తున్నాం. స్టడీ మెటీరియల్‌తో పాటు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తూ వారిని రాటుదేలేలా సిద్ధం చేస్తున్నాం. బీసీ స్టడీ సర్కిల్ ప్రారంభమైనప్పటి నుంచి 66మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ప్రైవేటు రంగాల్లో 300 ఉద్యోగాలను అభ్యర్థులు సాధించారు. రెండు జాబ్‌మేళాలు నిర్వహించగా, 130 మంది వివిధ కంపెనీల్లో చేరారు. లైబ్రరీ సేవలతో పాటు అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్‌ను అందిస్తున్నాం. కానిస్టేబుల్, ఎస్సై శిక్షణ ఇటీవలే పూర్తయింది. వివిధ పోటీ పరీక్షలకు నోటిఫికేషన్ వెలువడగానే శిక్షణ ప్రారంభిస్తాం. పట్టుదల, క్రమశిక్షణ ఉన్న వారందరూ ఉద్యోగాలను సాధించవచ్చు. కష్టపడి చదివే వారందరికీ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది. బీసీ స్టడీ సర్కిల్ కేంద్రాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి.
– కృష్ణ దయాసాగర్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్, సిద్దిపేట