జహీరాబాద్, మార్చి 15: గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నులు వంద శాతం వసూలు చేసేందుకు పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా పని చేయాలని సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మంగళవారం జహీరాబాద్ డివిజన్‌స్థాయి పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో ఏర్పాటు చేసి పలు సూచనలు, సలహాలు చేశారు. ప్రతి పంచాయతీలో ఆడిట్ అభ్యంతరాలు ఉంటే సరిచేసుకోవాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం, రోడ్లు సకాలంలో శుభ్రం చేయాలని, నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పల్లె ప్రగతి యాప్‌లో డీఎస్ఆర్ నమోదు చేయాలన్నారు. పల్లె ప్రగతి పనులు, వైకుంఠ ధామాలు, తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డులో వేయాలన్నారు. నర్సరీల నిర్వహణ, హరితహారం మొక్కలను వంద శాతం కాపాడుకోవాలన్నారు. డోజర్ల కొనుగోలు, ట్రాక్టర్, ట్యాంకర్లు, ట్రాలీ రిజిస్ట్రేషన్ తదితర అంశాలను పరిశీలించాలన్నారు. విద్యుత్ పెండింగ్ బకాయిలు వెంటనే పూర్తి కావాలని, పారిశుధ్య కార్మికులకు ప్రతి నెల వేతనాలు చెల్లించాలన్నారు. ఆన్లైన్లో పంచాయతీ సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌మోహన్, జహీరాబాద్ డివిజన్ డీఎల్పీవో రాఘవరావు, డివిజన్లోని జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్, న్యాల్కల్, ఝరాసంగం, రాయికోడ్ మండల పంచాయతీ అధికారులు మహేశ్వర్‌రావు, సంజీవ్‌కుమార్, వెంకట్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.