మల్లన్నసాగర్ స్లీవ్ నుంచి వాగులోకి నీళ్లు
భూగర్భ జలాల వృద్ధే సీఎం కేసీఆర్ ధ్యేయం
కూడవెల్లి పరీవాహక పాంత్రంలోని ప్రతి ఎకరానికి సాగు నీరు
టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
మిరుదొడ్డి, ఫిబ్రవరి 27 : త్వరలో కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు రానున్నాయని టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని మోతె శివారులోని కూడవెల్లి వాగులో రూ.4.25 కోట్ల నిధులతో నిర్మిస్తున్న చెక్‌డ్యామ్ పనులను ఆదివారం పరిశీలించారు. పనులను త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ బీడు భూములను పచ్చని పంటలుగా మార్చి రైతులను రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. కూడవెల్లి వాగుపై ఇప్పటికే ప్రభుత్వం 46 చెక్ డ్యామ్‌లను నిర్మించిందన్నారు. కూడవెల్లి వాగు జగదేవ్‌పూర్ మండలంలోని చేబర్తి గ్రామం నుంచి అప్పర్ మానేరు డ్యామ్ వరకు 65 కిలో మీటర్ల దూరం వరకు ప్రవహిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ గోదావరి నదిపై కాళేశ్వరం రిజర్వాయర్‌ను నిర్మించి ఎత్తిపోతల పథకం ద్వారా రంగనాయక్, కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్లలోకి నీటిని నింపుతూ తాగు, సాగునీటిని సరఫరా చేస్తున్నారన్నారు.
కూడవెల్లి వాగు ఏడాది పాటు నీటితో కళకళలాడనున్నది చెప్పారు. ఎండాకాలం వస్తే కూడవెల్లి ఎండిపోయి పంటలకు నీరందకపోవడంతో రైతులు ఆర్థికంగా తీరని నష్టం జరిగేదన్నారు. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లోని గ్రామాలకు సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్‌రావుల ఆశీస్సులతో కూడవెల్లి వాగులోకి వ్యవసాయ రంగానికి సాగునీరు అందుతుందన్నారు. కాసులాబాద్, మోతె, రుద్రా రం, భూంపల్లి గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు సహకారంతో నిధులను మంజూరు చేస్తామని తెలిపారు. మరో 15 రోజుల్లో కూడవెల్లి వాగులోకి మల్లన్నసాగర్ స్లీవ్ నుంచి నీటిని విడుదల చేస్తామన్నారు. ఎంపీ వెంట సర్పంచుల ఫోరం మం డల అధ్యక్షుడు తుమ్మల బాల్‌రాజు, మోతె సర్పంచ్ కాలేరు శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల సీనియర్ నాయకుడు సూకురి లింగం, భూంపల్లి ఉప సర్పంచ్ ప్రభాకర్, టీఆర్ఎస్ నాయకులు దుబ్బరాజం, భూపతిగౌడ్, రాజేశ్వర్, రవి, కుమార్ తదితరులు ఉన్నారు.