చేగుంట, మే 26: సమాజంలో ఒకప్పుడు మహిళలను చిన్న చూపు చూసేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత గ్రామీణ మహిళలు ఆర్థిక అభివృద్ధిలో దూసుకుపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో మహిళా సంఘాలు తమ కాళ్లమీద నిలబడి పది మందికి ఉపాధి కల్పించి ఆదర్శంగా నిలుస్తున్నా రు. చేగుంట ఐకేపీ ఏపీఎం లక్ష్మీనర్సమ్మ మహిళ సంఘాల అభివృద్ధితో పాటు వారికి ప్రభుత్వ పరంగా ఏదో రకమైన ఉపాధి కల్పించాలనే లక్ష్యం తో మండలంలోని కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకున్నారు.
ఆ గ్రామల్లోని మహిళలకు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పట్టికీ రోజుకు ఒక రూపాయి చోప్పున నెలకు రూ. 30 పొదుపు చేయించి 10నుంచి 13మంది సభ్యులతో బ్యాంకులో ఖాతాలు తెరిపించారు. నెల నెల పొదుపు చేసుకునే విధంగా ప్రోత్సహం అందిస్తున్నారు. మహిళ సంఘాల్లోని నైపుణ్యాన్ని బయటకు తీసి ఉపాధి మార్గాల వైపు తీసుకెళ్లారు. గతంలో చేగుంట మండలంలో నామమాత్రంగా ఉన్న గ్రామ సంఘాలను ఊరూరా తిరుగుతూ ఒక్కటి చేసి ఇప్పటి వరకు మండల వ్యాప్తంగా 9700మంది సభ్యులతో 933 సంఘాల ఏర్పాటుకు కృషి చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం, పోషణ్‌అభియాన్, పల్లెప్రగతి, అక్షరాస్యత పెంపు, బాల్యవివాహాల నివారణ వంటి ప్రతి కార్యక్రమాల్లో మహిళలను భాగస్వామ్యం చేస్తూ ప్రజలను చైతన్యపరిచారు. సంఘాల్లోని మహిళల ఉపాధి, ఆర్థికాభివృద్ధి కోసం 27కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు, స్త్రీనిధి ద్వారా రూ. 8కోట్లను పావలా, రూపాయి వడ్డీతో వచ్చిన రుణా లు తీసుకున్నారు. చేగుంటలో కుట్టుశిక్షణ కేంద్రం, బుట్టలు, డోర్ కాటన్స్, అల్లికలు, మాస్కుల తయారీతో పాటు పలు రకాల వ్యాపారాలకు రుణాలు తీసుకున్నారు.
అనంతసాగర్‌లో చింతపండును ప్యాకింగ్ చేసి ఇతర రాష్ర్టాలకు సరఫరా చేయడం, వడియారంలో మురుకులు, పాపడాలు, అప్పడాలు, మక్కరాజిపేటలో పేపర్ ప్లేట్ల తయారీ, 10రకాల చట్నీలు, టీ స్టాల్స్, మొబైల్ టీఫిన్ సెంటర్స్, బీ-కొండపూర్‌లో గోధుమపిండి, శనగపిండి తయారీ, కిరాణం, బట్టలు, పిండి గిర్ని, బ్యాంగిల్ స్టోర్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. రుక్మాపూర్‌లోని మహిళా రైతులు ఆకుకూరలు, బీర, బెండ, టమాటా, కాకర, బంతి తోటలతో ఉపాధి పొందుతుండగా, కర్నాల్‌పల్లిలో మేకలు, గొర్రెలు పెంపకంతో యాదవులకు ఉపాధి దొరికింది.
మహిళలు తయారు చేసిన వస్తువులు, ఉపాధి మార్గాలను జిల్లా డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్‌రావు, డీపీఎం ప్రకాశ్ స్వయంగా పరిశీలించి అభినందించారు. ప్రభుత్వం అదనంగా కరోనా రుణాలు ఇవ్వడంతో మహిళ సంఘాల ఆధ్వర్యంలో మటన్, చికన్, కూరగాయల దుకాణం, నిత్యావసర వస్తువులకు సంబంధించిన వాటిని ఏర్పాటు చేయడంతో అధికారులు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. గ్రామాల్లో మహిళలు ఏర్పాటు చేసిన వ్యాపారంతో సామాన్యులకు అందుబాటులో అన్ని రకాల వస్తువులు దొరకడంతో ప్రజలకు సౌలభ్యంగా మారింది.
నిరుపేద ఆడ బిడ్డల పెండ్లిలకు మహిళ సంఘాలు ఎంతో ప్రోత్సా హం అందిచాయి. మహిళ జాతీయ దినోత్సవం సందర్భంగా మహిళ సంఘాల సహకారంతో అవార్డులు రావడం అదృష్టంగా బావిస్తున్నా..
– లక్ష్మీనర్సమ్మ , ఏపీఎం చేగుంట
తెలంగాణ ప్రభుత్వం సంఘాలకు అందిస్తున్న ప్రోత్సా హం మరువలేనిది. సంఘా ల్లో రుణాలు పొంది చెల్లించి, సంఘాల అభివృద్ధికి ప్రతి నెల సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. సమావేశంలో కుటుంబ సభ్యులుగా వ్యవహరించి, వారికి ఎదైనా ఇబ్బందులు వచ్చినచో అండగా ఉంటాం.