జిన్నారం, మే 26: మండలంలో గురువారం సాయం త్రం ఈదురుగాలులతో కూడిన జోరు వాన కురిసింది. దాదాపు గంట పాటు కురవడంతో భూతాపం చల్లబడింది. రోడ్ల పక్కన గుంతలన్నీ నీటితో నిండాయి. గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడలో వర్షం నీరు వరదగా పారింది. గ్రామాలు, పారిశ్రామిక వాడలో గాలి దుమారానికి చెట్లు కూలాయి. చెట్టు కొమ్మలు విరిగాయి. దీంతో కొద్ది సేపు కరెంటుకు అంతరాయం ఏర్పడింది. మామిడి కాయలు నేలరాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పారిశ్రామిక వాడలో రసాయన వ్యర్థాల వరద ఆగలేదు. దీంతో గడ్డపోతారం అయ్యమ్మ చెరువులోకి, ఖాజీపల్లి గండి చెరువులోకి రసాయన వ్యర్థాలు భారీగా చేరాయి.
కొల్చారం, మే 26: కొల్చారంలో ఒక్కసారిగా కురిసిన అకాల వర్షంతో రైతన్నకు తీరని నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాలకు తెచ్చి ఆరబోసిన ధాన్యం కిందకు వర్షపు నీరు చేరి తడిసి ముద్దయింది. రైతులు టార్పాలిన్లు కప్పి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
మనూరు, మే 26: మనూరు మండలంలోని పలు గ్రామాల్లో గురువారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో కొంత ఉపసమనం పొందారు. బోరంచ జాతరకు వచ్చిన భక్తులకు వర్షంతో ఇబ్బందులు ఎదురయ్యాయి.
నాగల్గిద్ద,మే26: మండలంలో గురువారం ఒక గంట సేపు భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు ఈదురు గాలులు వీయడంతో గ్రామాల్లో కొన్ని ఇండ్లపై రేకులు ఎగరిపడ్డాయి.
గుమ్మడిదల, మే26: ఈదురుగాలులతో వడగండ్ల వర్షం గంటపాటు కురియడంతో రైతు కన్నీళ్లు పెట్టుకున్నారు. గురువారం గుమ్మడిదల మండల వ్యాప్తంగా వడగండ్ల వాన కురియడంతో రైతులు ఆగమాగమయ్యారు. ఆకాల వర్షాలకు గుమ్మడిదల టోల్ గేట్ వద్ద ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. దీంతో రైతులు తాడ్పత్రీలు కప్పే ప్రయత్నం చేశారు. ధాన్యం పూర్తిగా తడిసి వాన నీటికిలో కొట్టుకుపోయింది. జాతీయరహదారిపై వడగండ్ల వాన కురవడంతో గంట పాటు ప్రయాణికులు నిలిచిపోయారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కూడా ధాన్యం తడిసిముైద్దెనది. ఈదురుగాలులకు మామిడి రైతులకు నష్టం వాటిల్లింది. కూరగాయ పంటలు నీటిమట్టం అయ్యాయి. పంట తీవ్రంగా నష్ట పోయింది.
కల్హేర్, మే 26: వర్షం వస్తుందని నువ్వులు తడిసిపోకుండా పాల్తిన్ కవర్ కప్పేందుకు వెళ్లిన దంపతులపై పిడుగు పడి భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఈ ఘటన గురువారం చోటుచేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్హేర్ మండలం అలీఖాన్పల్లి గ్రామానికి చెందిన కాట్రోత్ జగన్ (40), భార్య కాట్రోత్ మారోని (39) సేన్లో పండించిన నువ్వులను ఎండబెట్టారు. గురువారం మధ్యాహ్నం మబ్బులు కమ్ముకోవడంతో వర్షం కురుస్తుందని నువ్వుల కట్టలు తడిసిపోకుండా పాల్తిన్ కవర్ కప్పేందుకు సేను వద్దకు వెళ్లారు. కవర్ కప్పుతుండగా వారి వద్ద పిడుగు పడింది. దీంతో జగన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మారోని అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో సంగారెడ్డి దవాఖానకు ఆమెను తరలించారు.