ఝరాసంగం, మే 27 : వందల ఏండ్ల క్రితం నిర్మించిన కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. చరిత్రను చాటే సాక్ష్యాలుగా ఆయా గ్రామాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మండలంలోని మాచ్నూర్, పొట్టిపల్లి, ఎల్గోయి, కృష్ణాపూర్, గ్రామాల్లోని బురుజులు, ముఖద్వారాలు, వ్యవసాయ బావులు నేటికీ ఎంతో ఆకర్షణీయంగా కనబడుతున్నాయి. ఈ నిర్మాణాలు చూడముచ్చటగా, చరిత్రను చెప్పుకోవడానికి ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా నిలబడుతున్నాయి.
మాచ్నూర్ గ్రామంలో బురు జు, ముఖద్వారం (గౌని), మడిగెల వ్యవసాయ బావిని ఎర్ర రాతితో 60 అడుగుల ఎత్తు వరకు నిర్మించారు. ఈ గౌని, బురుజు, మడిగెల బావి నిజాం కాలంలో నిర్మించినట్లు పెద్దలు చెబుతుంటారు. ఇప్పటికీ ఇవి చెక్కు చెదరలేదు. ఈ బురుజుకు రెండు సొరంగ మార్గాలున్నాయి. ఒకటి ధాన్యం నిల్వ కోసం, మరొకటి గ్రామ శివారు చివరి వరకు ఉంటుందంటూ వృద్ధులు చెబుతుంటారు. ఆనాడు నిజాం రాజు బీదర్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వచ్చి సేద తీరుతుండేవాడంటారు. ఇప్పటికీ మడిగెల బావిలో నీరు పుష్కలంగా ఉండడంతో రైతు అశోక్‌రెడ్డి పలు రకాల పంటలు సాగు చేస్తున్నారు. పొట్టిపల్లి గ్రామంలోనూ పూర్వకాలం నాటి బురుజు (గౌని), గ్రామ శివారులో సిద్ధేశ్వర స్వామి దేవాలయం, కుప్పానగర్ గ్రామంలో నిర్మించిన బురుజు నేటికీ చెక్కు చెదరలేదు. ఉదయం సూర్య కిరణాలు ఆ బురుజుపై పడడం ప్రత్యేకత.
ఎల్గోయి, కృష్ణాపూర్లను జాగీర్దార్ గ్రామాలంటారు. జాగీర్దార్ అంటే ఆనాడు నిజాం రాజు ఇక్కడకు వచ్చి సేదతీరేవాడు. ఆ సమయంలో ఆయన గ్రామాల్లో సాగు చేసుకునేందుకు భూములు ఇచ్చేవాడు. దీంతో వాటిని జాగీర్దార్ గ్రామాలు అని పిలుస్తుంటారని గ్రామస్తులు తెలిపారు. ఈ గ్రామాల్లో బురుజు, బురుజు చుట్టూ ప్రహరీ (కందకం) నిర్మించి ఉంది. ఆనాటి కట్డడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అందగా ఉన్నాయి.
ఏండ్లనాటి కట్టడాలు బురుజు, గ్రామ ముఖద్వారం, మడిగెల వ్యవసాయ బావి ఇప్పటికీ గట్టిగా ఉన్నాయి. ఇవి గ్రామానికి ఎంతో ఆకర్షణీయంగా కనబడుతున్నాయి. అప్పటి కట్టడాలు ఏండ్ల తరబడి మన్నేవి. బావితో వ్యవసాయానికి సాగు నీరందుతున్నది. ప్రత్యేకంగా మా ఇంటి పక్కన ఉండడంతో సంతోషంగా ఉంది.
– అంజన్న, గ్రామస్తుడు, మాచ్నూర్
మా గ్రామంలో నిజాం కాలం నాటి కట్టడాలు ఉండడం సంతోషంగా ఉంది. బురుజు, గ్రామం చుట్టూ కందకం, రెండు మడిగెల వ్యవసాయ బావులున్నాయి. ఎర్ర రాతితో కట్టినవి. ఇవి ఇప్పటికీ గట్టిగానే ఉన్నాయి. ఎత్తుగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఈ బావితో భూముల సాగుకు నీరందడం ఆనందంగా ఉంది. పురాతన కట్టడాలు ఆకర్షణీయంగా ఉన్నాయి.
– శ్రీశైలం స్వామి, గ్రామస్తుడు, మాచ్నూర్