సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు4: రైతు మృతిచెందిన వెంటనే అందుకు సంబంధించిన క్లైమ్ పత్రాలను బీమా పోర్టల్‌లో నమోదు చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ ఏ.శరత్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా ప్రభుత్వ పథకాలపై దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏదైనా కారణంతో రైతు మరణిస్తే క్లైమ్ డాక్యుమెంట్లు విధిగా నమోదు చేయాలన్నారు. పీఎం కిసాన్‌కు సంబంధించి ప్రతి రైతుకు ఈ కేవైసీ చేయించాలని సూచించారు. ప్రతి ఏఈవో, ఎంఏవో, ఏవోఏ సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు.
విధుల్లో ఎలాంటి అలసత్వం వహించకుండా నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నర్సింహారావు, డివిజనల్, మండల స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 4: మన ఊరు – మన బడి పనులు వేగంగా పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో విద్యా, ఇంజినీరింగ్ శాఖ అధికారులతో మన ఊరు – మన బడి, మన బడి – మన బస్తీ పనుల పురోగతిపై సమీక్షించారు. ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీల వారీగా ఇప్పటివరకు పూర్తయిన పనులు, ప్రస్తుతం పురోగతిలో ఉన్న పనులు, టెండర్ ప్రక్రియలో ఉన్న పనులు, జాప్యానికి గల కారణాలు తదితర అంశాలపై సంబంధిత ఏజెన్సీలు, విద్యాశాఖ అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పురోగతిలో ఉన్న పనులు వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంకా ప్రారంభం కాని పనులను వెంటనే ప్రారంభించి, వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. టెండర్ స్టేజీలో ఉన్న పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తి కావాలని ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.
ఆయా పాఠశాలల్లో పనుల జాప్యంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా పనులకు సంబంధించి వచ్చే వారంలోగా పురోగతి ఉండాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజర్షి షా, డీఈవో రాజేశ్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, టీఎస్ఈడబ్ల్యూ, ఐడీసీ, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్ శాఖల ఈఈలు, ఇంజినీరింగ్ శాఖల డీఈలు తదితరులు పాల్గొన్నారు.