మనోహరాబాద్, మే 27: ఇయ్యాల ఓ తాన జాగా కొనాలంటే లక్షలు పెట్టాలే.. అలాంటిది జాగతో పాటు లక్షలు ఖర్చు పెట్టి ఇండ్లు కట్టి అర్హులైన నిరుపేదలకు అందజేస్తున్నారు సీఎం కేసీఆర్ అని ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మనోహరాబాద్ మండలం రామాయిపల్లి, పాలాట, కొనాయిపల్లి పీటీ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన డబుల్‌బెడ్ రూం ఇండ్లను జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించి, లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ‘ఇల్లు కట్టి చూడు.. పెండ్లి చేసి చూడు’ అని సామెత ఉండేది అంటే ఇల్లు కట్టినా.. పెండ్లి చేసినా అప్పుల పాలయ్యే పరిస్థితి అని అర్థం అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న సీఎం కేసీఆర్ నిరుపేదలకు పైసా ఖర్చులేకుండా ఇల్లు కట్టించి ఇవ్వడంతో పాటు ఆడపడుచు వివాహానికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా రూ.లక్షా 1,116ను అందిస్తున్నారన్నారు.
ఒక్కప్పుడు గజ్వేల్ నుంచి గెలిచి మంత్రి అయిన గీతారెడ్డి బుగ్గల కార్లలో వచ్చి తిరిగి పోతుండే, కనీసం ఆడబిడ్డల కోసం తాగునీటి సదుపాయాన్ని కూడా కల్పించలేదని మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. విజయరామారావు పోయి సంజీవరావు వచ్చే, ఆయన పోయి గీతారెడ్డమ్మ వచ్చే.. ఎవరు వచ్చినా, పోయినా కనీసం మా చెల్లెళ్ల నీటి కష్టాలను పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత ఇంటింటికీ నల్లా కనెక్షన్లు, శుద్ధిచేసిన తాగునీటిని అందిస్తూ ఆడబిడ్డల నీటి కష్టాలను దూరం చేశారన్నారు.
ఇదే హల్దీవాగులో ఎండకాలంలో ఎప్పుడన్నా నీళ్లు ఉంటుండేనా? ఇప్పుడు కాళేశ్వరం మహా ప్రాజెక్టుతో హల్దీవాగులో మండుటెండెల్లో గోదారమ్మ జలాలు చెక్‌డ్యాంలు దుంకుకుంటా నీళ్లు పారుతున్నాయని, సీఎం కేసీఆర్ పుణ్యమా అని కాళేశ్వరం నీళ్లు హల్దీవాగులో పారుతుంటే లక్షల ఎకరాల్లో రైతులు సంతోషంగా పంటలు పండిచారన్నారు. సర్కారు నౌకరికి ఎంత క్రేజ్ ఉందో అదేవిధంగా సర్కారు దవాఖానకు, సర్కారు బడికి అంతే క్రేజ్ రాబోతుందన్నారు. నేడు సర్కారు దవాఖానలు కార్పొరేట్ దవాఖానలను తలదన్నేలా ఉన్నాయని, ప్రసవాలు సైతం పెరిగాయన్నారు. అంతకుముందు హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు.
రాష్ట్రంలో నిరుపేదలు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సొంత జాగ ఉన్న వారు ఇల్లు కట్టుకుంటామంటే రూ.3లక్షలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్, బీజేపీ వాళ్లు దునియా మాట్లాడుతున్నారని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టే పథకాలను చూసి కేంద్రం ఓర్వడం లేదన్నారు.
అమిత్‌షా, మోదీ తెలంగాణ అభివృద్ధి కోసం ఒక్కమాట మాట్లాడలేదన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ ప్రయోజనం పొందేందుకు రెచ్చ గొడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ చేయకపోతే మనోహరాబాద్ మండలం అవుతుండేనా? ఇంత అభివృద్ధి జరుగుతుండేనా? అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హరీ శ్, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, గడా ఓఎస్డీ ముత్యంరెడ్డి, ఆర్డీవో శ్యాంప్రకాశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు మహేశ్, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, ఎంపీపీ పురం నవనీతరవి ముదిరాజ్, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, రైతుబంధు మండల కో-ఆర్డినేటర్ సుధాకర్‌రెడ్డి, ఎంపీటీసీలు నవనీత, శ్రీలత, లతావెంకట్గౌడ్, సర్పంచ్‌లు ప్రభావతి, మహిపాల్‌రెడ్డి, పార్వతిమల్లేశ్, నత్తి మల్లేశ్, నాయకులు చంద్రశేఖర్ ముదిరాజ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.