కొమురవెల్లి, మే 26 : మండలంలోని కిష్టంపేట గ్రామం ఐక్యతకు నిదర్శంగా చెప్పవచ్చు. ఈ గ్రామం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటూ ఊరిని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ గ్రామపంచాయతీ పరిధిలో 8 వార్డులు ఉండగా, 1411 జనాభా ఉంది. మహిళలు 697, పురుషులు 715 ఉన్నారు. 298 ఇండ్లు ఉన్న గ్రామానికి ప్రతినెలా రూ.1.76 లక్షల నిధులు ప్రభుత్వం నుంచి వస్తున్నాయి.

గ్రామంలో ఏదేని పనులు చేయాలనుకుంటే సర్పంచ్ బీమనపల్లి కరుణాకర్, ఎంపీటీసీ బందెల దుర్గారెడ్డి గ్రామస్తులను అడిగి తెలుసుకొని, వారందరి అభిప్రాయం మేరకు ఐకమత్యంతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అభివృద్ధి పనుల్లో గ్రామస్తులను భాగస్వామ్యం చేయడంతో సత్ఫలితాలు వస్తున్నాయి. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సహకారంతో సర్పంచ్ కరుణాకర్ ప్రత్యేక కృషితో కిష్టంపేట ప్రగతిలో తన రూపురేఖలు మార్చుకుంటున్నది.
కిష్టంపేటలో వివిధ పార్టీలు ఉన్నప్పటికీ, గ్రామాభివృద్ధి విషయంలో అందరూ ఒక్కటిగా ఉంటారు. ఎంతలా అంటే ఎన్నికల సమయంలో ఎవరికి వారే యమునా తీరుగా ఉండే పార్టీల వాళ్లు..జాతీయ జెండా విషయంలో గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద అన్ని పార్టీలకు సర్పంచ్ బీమనపల్లి కరుణాకర్ సమానంగా గద్దెలు ఏర్పాటు చేయించడం వారి ఐక్యతను తెలియ జేస్తుంది.
గతంలో గ్రామాల్లో పాలన పారిశుధ్య నిర్వహణ ఆస్తవ్యస్తంగా ఉండేది. తెలంగాణ ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం తేవడం, పరిపాలనలో సంస్కరణలు అమలు చేయడంతో మార్పు వచ్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా కేంద్ర ఆర్థిక సంఘం నిధులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు నిధులు సమకూరుస్తున్నది.

పల్లెల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పల్లె ప్రగతి కార్యక్రమం అమలు తర్వాత గ్రామంలో మౌలిక వసతులు సమకూరాయి. వైకుంఠధామ, డంపింగ్ యార్డు నిర్మించారు. ట్యాంకర్, ట్రాలీతో కూడిన ట్రాక్టర్ అందజేశారు. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మంచినీరు అందుతున్నది. పల్లె పకృతి వనం, వ్యవసాయక్షేత్రాల్లో కల్లాల నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేశారు.
పట్టణాల్లో మాదిరిగా ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె పకృతివనం ఆహ్లాదభరితంగా మారింది. పకృతి వనంలో వాకింగ్ ట్రాక్, పిల్లలు ఆడుకునేందుకు ఊయల, జారుడబండ వంటి ఆట పరికరాలు ఏర్పాటు చేశారు. కాలక్షేపానికి వచ్చే వారు కూర్చునేందుకు సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు. గ్రామంలో యువత కోసం సర్పంచ్ బీమనపల్లి కరుణాకర్ గ్రామస్తుల సహకారంతో వ్యయామశాల ఏర్పాటు చేశారు.
గ్రామంలో జాతీయభావం పెంపొందించేలా మహాత్మాగాంధీ, స్వామి వివేకానంద, డాక్టర్ అంబేద్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్ వంటి మహోన్నత వ్యక్తుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. త్వరలోనే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో చేతుల మీదుగా విగ్రహాలు ఆవిష్కరించనున్నట్లు సర్పంచ్ తెలిపారు.
పల్లె ప్రగతితో మాగ్రామంలో సౌకర్యాలు సమకూరాయి. ఊరి బాగుకోసం గ్రామస్తులు మంచి సహకారం అందిస్తున్నారు. మౌలిళిక వసతులు సమకూరడంతో పాటు గ్రామం పచ్చదనం, పరిశుభ్రంగా మారింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సహకారంతో గ్రామాన్ని స్వచ్ఛతతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. గ్రామస్తుల సహకారంతో మరింత అభివృద్ధి చేస్తా.
– బీమనపల్లి కరుణాకర్, సర్పంచ్, కిష్టంపేట