సిద్దిపేట, మే 26: రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారులదేని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రం సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ, విద్యుత్ అధికారులు, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో 50శాతం మేర ధాన్యం కొనుగోళ్లు జరిగాయని, ఇప్పటికే 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపారు. మరో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉందన్నారు. మిగిలిన ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు.
అకాల వర్షాలకు ధాన్యం తడిస్తే రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు చేయాలని అడిషనల్ కలెక్టర్‌ను ఆదేశించారు. జిల్లాలో పలు రైస్‌మిల్లుల సీజ్ విషయమై సివిల్ సైప్లె కమిషనర్ అనిల్‌కుమార్‌తో ఫోన్లో మం త్రి మాట్లాడారు. రైతులకు ఏమా త్రం ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరించాలని, ఈ విషయంలో ప్రత్యేక దృష్టిసారించాలని అడిషనల్ కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు.
60 ఏండ్ల నుంచి తండ్లాటతో అలిసిపోయిన కోదండరావుపల్లి భూబాధితులకు మంత్రి తీపికబురు చెప్పారు. కోదండరావుపల్లి భూసమస్యకు వారం రోజుల్లో పరిష్కారం లభించనుందన్నారు. దీర్ఘకాలికంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూ సమస్యపై సీసీఎల్ఏ, రెవెన్యూ అధికారులతో చర్చించి గ్రామస్తులకు చెందేలా ప్రత్యేక దృష్టి సారించాలని, కావాల్సిన అనుమతి ఇవ్వాలని కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు భూసమస్యపై సీసీఎల్ఏ, రెవెన్యూ అంశాలు, ఆమోదంపై ఉన్నతాధికారులు చొరవపై అడిషనల్ కలెక్టర్‌తో చర్చించి గ్రామస్తులకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
సిద్దిపేట పట్టణంలో ప్రజలకు అంతరాయం లేకుండా నిత్యం తాగునీటి సరఫరాకు కృషి చేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రింగుమేన్ పనులపై, మిషన్ భగీరథ అధికారులతో సమీక్షించారు. పట్టణ జనాభాకు అనుగుణంగా ప్రస్తుతం రోజుకు 250లక్షల లీటర్ల నీరు అవసరమని, 2050 నాటికి జనాభాకు అనుగుణంగా ముందుచూపుతో మల్లన్నసాగర్ నుంచి రింగ్‌మేన్ ద్వారా 450 లక్షల లీటర్ల తాగునీరు తెచ్చేలా కార్యాచరణ రూపొందించినట్లు మంత్రి తెలిపారు.
సిద్దిపేట పట్టణ రింగురోడ్డు చుట్టూ 11కి.మీ మేర రింగ్‌మేన్ పనులు ప్రారంభమయ్యాయని, మధ్యమధ్యలో చెట్లు, రోడ్డు, కల్వర్టు, విద్యుత్ పోల్స్‌కు ఇబ్బంది కలుగకుండా క్రమపద్ధతిలో పైపులైన్ వేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. పనులు ముమ్మరంగా చేపట్టాలన్నారు. ప్రస్తుత కొత్త పట్టణ పరిధి ప్రాంతాల్లో అవసరమైన దృ ష్ట్యా 5 లక్షల లీటర్ల సామర్థ్యంతో నాలుగు మంచి నీటిట్యాంకుల నిర్మాణం కోసం అధికారులు ప్రతిపాదించగా, మంత్రి ఆమోదం తెలిపారు. సమీక్షా సమావేశంలో సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, మిషన్ భగీరథ సీఈ విజయ్‌ప్రకాశ్, ఎస్ఈ శ్రీనివాస్‌చారి, ఈఈ రాజయ్య, తహసీల్దార్లు విజయ్, ఉ మారాణి, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలోని భూనిర్వాసితులకు ఇచ్చిన ఇండ్ల్లు, ప్లాట్లకు వెంటనే రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జాను మంత్రి హరీశ్‌రావు ఫోన్లైన్లో ఆదేశించారు. జిల్లాలోని మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, అనంతగిరి రిజర్వాయర్‌లో నిర్వాసితులకు కేటాయించిన ఇండ్లు దాదాపు 6 వేల వరకు ఉంటాయని, తహసీల్ కార్యాలయంలో ఆయా నిర్వాసిత ఇండ్లు, ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు రోజువారీగా మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్వి గజ్వేల్‌లో, అనంతగిరివి చిన్నకోడూరు తహసీల్ కార్యాలయంలో జరిగేలా చూడాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డికి సూచించారు.
మే 31న రైల్వే సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు, ఈ సమీక్షకు రైల్వే అధికారులు హాజరు కానున్నారని, జిల్లాలోని అన్ని మండలాల వారీగా చేపట్టాల్సిన అంశాలపై ప్రతిపాదిత బుక్లెట్స్ నివేదికలతో అధికారులు హాజరు కావాలని అడిషనల్ కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. సిద్దిపేట నర్సాపూర్ రైల్వేలైన్‌లో భూమి కోల్పోయిన వారికి ఇండ్ల పట్టాలు, పాత కాలనీ లేఔట్లు, పట్టణంలో మిగిలిన డబుల్ బెడ్రూం ఇండ్లు, 58 జీవో స్థల క్రమబద్ధీకరణకు ప్రొసీడింగ్ కాపీల పంపిణీకి సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.