మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 13: ప్రస్తుత విద్యా సంవత్సరంలో షెడ్యూల్ కులాలకు సంబంధించి ఫ్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం పెండింగ్‌లో ని రెన్యూవల్, నూతన రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. మెదక్ కలెక్టరేట్లోని ఆడిటోరియంలో గురువారం జిల్లాలోని వసతి గృహాల సంక్షేమాధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా విద్యార్థులకు ఉపకార వేతన రూపంలో ఇవ్వకపోవడం సరికాదన్నారు. చదువుకునే పేద విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలు అండగా ఉంటాయని, డబ్బు సమస్య లేకుంటే విద్యార్థులు చదువుపై దృష్టి సారించి రాణిస్తారన్నారు.
అర్హులైన ఏవిద్యార్థి విద్య నష్టపోకుండా ఉపకార వేతనం అందేలా అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల, కళాశాల స్థాయిలో పెండింగ్‌లోని దరఖాస్తుల రెన్యూవల్, నూతన రిజిస్ట్రేషన్ ప్రక్రియ, బయోమెట్రిక్‌ను పూర్తి చేయాలని సూచించారు. గడువులోగా హార్డ్‌కాపీలను సంబంధిత కార్యాలయాల్లో అందజేయాలని ప్రభుత్వ, ప్రైవేట్, పాఠశాలల, కళాశాలల ప్రిన్సిపాళ్లకు సూచించారు. విద్యార్థులకు కుల, ఆదాయ ధుృవీకరణ పత్రాల జారీలో సత్వర చర్యలు తీసుకోవాలని, జిల్లాలోని తహసీల్దార్లను ఆదేశించారు. విద్యార్థులు ఎక్కువ సంఖ్య లేని కళాశాలల్లో బయోమెట్రిక్ ద్వారా పూర్తి చేయాలని, ఈపాస్ లాగిన్‌లో విద్యార్థుల బ్యాంక్ వివరాలు తప్పుగా నమోదైతే సరిచేయాలన్నారు. మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్. షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, గిరిజన సంక్షేమాధికారి నీలిమ, జిల్లా ఇన్చార్జి విద్యాధికారి విజయ, జిల్లా అకాడమిక్ అధికారి సుదర్శనమూర్తి, కళాశాలల ప్రిన్సిపాళ్లు, వసతిగృహాల సంక్షేమాధికారులు పాల్గ్గొన్నారు.
శివ్వంపేట, నవంబర్ 13 : రైతుల నుంచి వచ్చే భూభారతి, సాదాబైనామా దరఖాస్తుల పరిశీలనలో అధికారులు వేగం పెంచాలని మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ తహసీల్దార్ కమలాద్రిని ఆదేశించారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించి భూభారతి, సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి దరఖాస్తుపై స్పష్టమైన పరిశీలన నివేదిక ఉండాలని, తిరస్కరణ జరిగితే సవివరమైన కారణాలు నమోదు చేయాలని ఆదేశించారు. సంబంధిత ప్రజా సేవలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. రెవెన్యూ అధికారులు రికార్డులను పరిశీలించి సమగ్ర నివేదికను వారం రోజుల్లో పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ షఫియొద్ద్దీన్ తదితరులు పాల్గొన్నారు.