
జ్యూట్, కాటన్, నాన్ ఓపెన్ ఫ్యాబ్రిక్ బ్యాగులు వాడాలి
ఉల్లంఘించిన వారిపై నోటీసులు, జరిమానాలు విధించాలి : మెదక్ కలెక్టర్ హరీశ్
మెదక్, సెప్టెంబర్ 3: ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుటలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మెదక్ కలెక్టర్ హరీశ్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మాణమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ప్రజలు భాగస్వాములై ప్రభుత్వానికి సహకరించినప్పుడే లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. ఈ డిసెంబర్ నాటికి ప్లాస్టిక్‌ను పూర్తిగా నిర్మూలించడంలో భాగంగా అక్టోబర్ ఒకటి నుంచి 75 మైక్రాన్ల మందంలోపు గల ప్లాస్టిక్‌ను ప్రభుత్వం బ్యాన్ చేస్తుందన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో, మున్సిపల్ ప్రాంతాల్లో దుకాణాల్లో 50 మైక్రాన్ల మందం కన్నా తక్కువ గల ప్లాస్టిక్ బ్యాగులను వెంటనే గుర్తించి తొలిగించాలని డీపీవో, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో ప్రత్యామ్నాయంగా జ్యూట్, కాటన్, నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ బ్యా గులు వాడాలని, వాటిపై ప్రజల్లో అవగాహన కలిగించాలన్నారు. జిల్లాలో స్వయం సహాయక మహిళా సం ఘాలు బ్యాగులు తయారు చేస్తున్నాయని చెప్పారు. ఆర్డర్ ఇస్తే తక్కువ ధరకు అందజేయడంతో పాటు వారికి జీవనోపాధి కల్పించి ఆర్థికంగా సహాయ పడిన వారవుతారన్నారు. జిల్లాలో ప్లాస్టిక్ నిర్మూలనపై అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, ఉల్లంఘించిన వారిపై నోటీసులు, జరిమానాలు విధించాలన్నారు. పర్యావరణానికి విఘాతం కలిగించే పారిశ్రామిక వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలిగించాలని జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ కృష్ణమూర్తికి సూ చించారు. జిల్లాలో 117 దవాఖానలు, నర్సింగ్ హోంలు ఉన్నాయని, వాటి ద్వారా వచ్చే బయోమెడికల్ వేస్ట్‌ను బయట పడవేయకుండా దూరంగా తరలించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్రావుకు సూచించారు. గ్రామాల్లో, పట్టణాల్లో భవన నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను కంట్రోల్ వాహనాల ద్వారా కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని ఆర్టీవోకు సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రవికుమార్, ఏడీ మైన్స్ జయరాజ్, జిల్లా అదనపు ఎస్పీ కృష్ణమూర్తి, ఆర్డీవో సాయిరాం, జిల్లా యువజన సంక్షేమాధికారి నాగరాజు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
జాబితా రూపొందించాలి
-గురుకుల విద్యార్థులకు కొవిడ్ టీకా వేయాలి
మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 3 : మెదక్ జిల్లాలోని అన్ని కళాశాల స్థాయి గురుకుల పాఠశాలల్లో 18 ఏండ్లు పైబడిన విద్యార్థులకు కొవిడ్ టీకా వేయడానికి మూడు రోజుల్లో జాబితా రూపొందించాలని మెదక్ కలెక్టర్ హరీశ్ గురుకులాల ప్రధానాచార్యులు, జిల్లా కోఆర్డినేటర్లకు సూచించారు. శుక్రవారం ఆయన చాంబర్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలకు చెందిన ప్రధానాచార్యులు, జిల్లా కోఆర్డినేటర్ల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 ఏండ్లు పైబడి ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి కొవిడ్ టీకా వేయనున్నట్లు పేర్కొన్నారు. బోధన బోధనేతల సిబ్బంది, సరుకులు సరఫరా చేసే ఏజెన్సీ వారందరూ టీకాలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్, ప్రతిమాసింగ్, బీసీ అభివృద్ధి అధికారి జగదీశ్ పాల్గొన్నారు.