
మనోహరాబాద్, జూలై 2: పచ్చదనం పెంపొందించడం, ప్రతి పల్లెను స్వచ్ఛమయంగా మార్చడానికి ప్రభుత్వం పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలు అమలు చేస్తున్నదని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లిలో నాలుగో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్ హరీశ్, జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతా, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ ఫుడ్స్చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్‌రెడ్డితో కలిసి గ్రామంలో మంత్రి నాలుగు గంటల పాటు పర్యటించారు. ఇంటింటికీ తిరిగి మొక్కలను అందించి పల్లె ప్రగతి ప్రాముఖ్యతను వివరించారు. గ్రామస్తులను పలుకరించి ప్రభుత్వ పథకాల అమలుపై ఆరాతీశారు. పల్లె ప్రకృతి వనం సందర్శించి అక్కడ ఆడుకుంటున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. వైకుంఠధామం, డంపింగ్‌యార్డును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధిలో దండుపల్లి భేష్ అని అభినందించారు. సర్పంచ్ పంజా లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి చైతన్యను సన్మానించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాక ముందు ఇదే పల్లెలో నీళ్ల కోసం బిందెలు పెట్టుకొని కొట్టుకునే పరిస్థితి ఉండేదని, విద్యుత్ సరఫరా సరిగా ఉండేది కాదని, చెత్త ఎక్కడ పడితే అక్కడ మురుగు కంపు వచ్చేది. ఒక్క చెట్టు కూడా కనిపించేది కాదన్నారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో గ్రామాల రూపురేఖలు మారిపోయాయన్నారు. పల్లెలు పరిశుభ్రంగా ఉండాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. ప్రజల ప్రమాణాలు మెరుగు పడాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు. అందుకోసమే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ గ్రామాల్లో మార్పు తెచ్చారన్నారు. మూడు విడుతలుగా నిర్వహించిన పల్లె ప్రగతితో విద్యుత్, వీధి దీపాల ఏర్పాటు, రోడ్లను పరిశుభ్రంగా ఉంచడం, చెత్తాచెదారాన్ని సేకరించి డంపింగ్‌యార్డుల్లో ఎరువుగా మార్చడం, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడం, ట్రాక్టర్లు, ట్యాంకర్లను కొనుగోలు చేసి పారిశుధ్య పనులు చేపట్టడంతో మార్పు వచ్చిందన్నారు. వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, స్వచ్ఛత విషయంలో సీఎం కేసీఆర్ అనేక మార్పులు తీసుకొచ్చారన్నారు. నెలనెలా గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ పారిశుధ్య నిర్వహణ, అభివృద్ధి పనులకు చేస్తున్నారని కొనియాడారు. ఒక్క దండుపల్లికే నెలకు రూ.80 వేల నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. కొత్త పంచాయతీగా ఏర్పడిన దండుపల్లి గ్రామాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. దళితులు అన్ని రంగాల్లో రాణించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని, ఇందుకోసం దళిత సాధికారిత పథకాన్ని తీసుకొచ్చారన్నారు.
దండుపల్లికి మంత్రి వరాల జల్లు..
దండుపల్లి గ్రామానికి మంత్రి వరాల జల్లు కురిపించారు. కొత్త పంచాయతీగా ఏర్పడిన దండుపల్లికి ఇదివరకే రూ.20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంజూరు చేయగా, అది నిర్మాణంలో ఉందన్నారు. సర్పంచ్ పంజా లక్ష్మి విజ్ఞప్తి మేరకు సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాల్వల నిర్మాణానికి రూ.25 లక్షలు, ఎస్సీ కమ్యూనిటీహాలుకు రూ.10 లక్షలు, 50 డబుల్‌బెడ్ రూం ఇండ్లు, గ్రామ పంచాయతీ భవనంపై ఫ్లోరులో మహిళా భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. రేషన్ దుకాణం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
విద్యుత్ శాఖ ఏఈపై మంత్రి ఆగ్రహం…
ఇండ్లపై తీగలు, పొలాల వద్ద వేళాడుతున్న తీగలను సరిచేయాలని కోరితే విద్యుత్‌శాఖ అధికారులు స్పందించడం లేదని, స్తంభానికి, మీటర్‌కు డబ్బులు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు మంత్రికి ఫిర్యాదు చేశారు. వెంటనే విద్యుత్‌శాఖ ఏఈ మధుకర్‌ను పిలువగా ఆయన సమావేశానికి ఆలస్యంగా హాజరయ్యాడు. దీంతో అతడిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ప్రతిమాసింగ్, డీపీవో తరుణ్‌కుమార్, గడా ఓఎస్డీ ముత్యంరెడ్డి, డీఆర్డీవో పీడీ శ్రీనివాస్, ఆర్డీవో శ్యాంప్రకాశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పురం మహేశ్ ముదిరాజ్, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, ఎంపీపీ పురం నవనీతరవి ముదిరాజ్, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, ఎంపీటీసీ లతా, రైతుబంధు మండల కో ఆర్డినేటర్ సుధాకర్‌రెడ్డి, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు హరికృష్ణ, సర్పంచ్ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్‌రెడ్డి, సర్పంచ్‌లు లక్ష్మి, నాగభూషణం, ముదిరాజ్ మహాసభ జిల్లా నాయకులు భాషబోయిన చంద్రశేఖర్ ముదిరాజ్, కూచారం నరేశ్ ముదిరాజ్, పంజా భిక్షపతి ముదిరాజ్, అధికారులు పాల్గొన్నారు.