కోహెడ, అక్టోబర్ 18: మావోయిష్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కాతా రాంచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్, రాజుదాదా అంత్యక్రియలు ఆయన స్వగ్రామం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లిలో ప్రశాంతంగా ముగిశాయి. శనివారం ఉదయం 6గంటలకు ఆయన మృతదేహం గ్రామానికి చేరకోగా, గ్రామస్తులు డప్పుచప్పుళ్లతో, డీజే సౌండ్లతో ఘన స్వాగతం పలికారు. ఊరిచివర నుంచి ఆయన స్వగృహం వరకు మృతదేహాన్ని తరలించారు. అనంతరం పౌరహక్కుల సంఘం నాయకులు, ప్రజాసంఘాల నాయకులు విప్లవ గీతాలు పాడి ఆయనకు జోహార్లు అర్పించారు.
చిన్ననాటి స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అబుజ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో రాంచంద్రారెడ్డి మృతిచెందగా, కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. తన తండ్రి బూటకపు ఎన్కౌంటర్లో చంపారని కుమారుడు కోర్టులో కేసు వేశారు. దీంతో నెల రోజుల పాటు మృతదేహం రావడంలో జాప్యం జరిగింది. హైకోర్టులో జాప్యం జరగడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తండ్రి మృతదేహానికి రీపోస్ట్‌మార్టం చేయాలని, తన తండ్రి మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ తతంగం ముగిసి మృతదేహం రావడానికి ఇంతకాలం పట్టింది. మధ్యలో పౌరహక్కుల సంఘం నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, వక్తలు రాంచంద్రారెడ్డి మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు.
బూటకపు ఎన్కౌంటర్లతో ఉద్యమాన్ని ఆపలేరు: నందిని సిధారెడ్డి
బూటకపు ఎన్కౌంటర్లతో ఉద్యమాన్ని ఆపలేరని మంజీరా రచయితల సంఘం అధ్యక్షుడు నందినీ సిధారెడ్డి అన్నారు. శనివారం రాంచంద్రారెడ్డి భౌతికకాయానికి ఆయన నివాళులర్పించి మాట్లాడారు. దేశంలో దుర్మార్గపు పాలన కొనసాగుతున్నదని మండిపడ్డారు. బీజేపీ సర్కారు దేశ సంపదకు కార్పొరేట్లకు, దేశ కుబేరులకు దోచిపెడుతున్నదని ఆరోపించారు. ఆపరేషన్ కగారు పేరిట మావోయిస్ట్‌లను అంతం చేయడానికి పూనుకోవడం నీచమైన చర్య అని, సమస్యను అంతం చేయకుండా వ్యక్తులను అంతం చేయడం సరికాదని నందినీ సిధారెడ్డి పేర్కొన్నారు.
ఇంద్రావతిలో పారేది విప్లవకారుల రక్తం: దేశపతి శ్రీనివాస్
ఇంద్రావతిలో పారేది నీళ్లుకాదని, విప్లవకారుల రక్తం అని దేశపతి శ్రీనివాస్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరిటి విప్లవకారులను అంతం చేయడం సరైన చర్య కాదన్నారు. సమస్యలను పక్కనపెట్టి విప్లవకారులను చంపటం ఇదేం పద్ధతని అని ఆయన ప్రశ్నించారు. దేనికైనా చర్చల ద్వారా పరిష్కారం ఉటుందని, చర్చలకు రాకుండా కేంద్ర ప్రభుత్వం దాడులు చేయడం తగదన్నారు. ఆధునిక యుద్ధ సామగ్రితో విప్లవకారులను మట్టుబెట్టడానికి కేంద్రం ప్రయత్నించడం తగదని, వ్యక్తులను చంపితే ఉద్యమం తిరిగి వస్తుందని, మంత్రులు ఇవ్వాల ఉంటారు పోతారు కానీ, సమస్యలను పరిష్కరిస్తే ఉద్యమం ఆగుతుందని దేశపతి శ్రీనివాస్ అన్నారు.