సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 24: మంజీరా వన్య ప్రాణుల అభయారణ్య కేంద్రానికి అంతర్జాతీయ గుర్తింపు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. సోమవారం మంజీరా వన్యప్రాణుల కేంద్రాన్ని ఈఎఫ్ఎస్ అండ్ టీ జాయింట్ సెక్రెటరీ వాణీప్రసాద్ ఐఏఎస్, డీఎఫ్‌వో శ్రీధర్‌రావు, ఈటీఆర్ఐ శాస్త్రవేత్తలు, పక్షుల పరిశీలకులు, మంజీరా వైల్డ్‌లైఫ్ శాంక్చూరీ బృందంతో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంజీరా నుంచి సింగూరు డ్యామ్ వరకు మంజీరా నదిలో మొత్తం 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నదని తెలిపారు. ఇక్కడ 9 ద్వీపాలు ఉన్నాయని, వాటిని పడవల్లో తప్ప, ఇతర మార్గాల ద్వారా చేరుకోలేమన్నారు.
అభయారణ్యం సరిహద్దు నుంచి 1000 మీటర్ల వరకు ఎకోసెన్సిటీవ్ జోన్‌గా గుర్తించామన్నారు. మంజీరా వైల్డ్‌లైఫ్ శాంక్చురీలో జీవవైవిధ్యం ఉండడంతో రాంసర్ సైట్‌గా ప్రకటించే అవకాశం ఉన్నదన్నారు. దాదాపు 303 రకాల పక్షులు ఉండగా, వాటిలో 117 కంటే ఎక్కువ జాతులు వలస పక్షులని పేర్కొన్నారు. 14 జాతుల ఉభయచరాలు, 57 జాతుల చేపలు, 32 రకాల సీతాకోక చిలకలు, 25 అకశేరుకాలు, 25 ఆర్కినిడ్లు, 28 ఓడోనేట్స్, 31 రకాల సరిసృపాలు ఈ అభయారణ్యం లో నివసిస్తాయని వివరించారు. ఇది రాంసర్ కింద జాబితా చేసేందుకు కచ్చితంగా అర్హత పొందుతుందని కలెక్టర్ పర్యటన బృందానికి వివరించారు. ఈ అభయారణ్యంలో లభ్యమయ్యే జంతుజాలం వైవిధ్యాన్ని జిల్లా అటవీశాఖ అధికారులు వివరించారు. సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.