Sangareddyసంగారెడ్డి, మే16: సంగారెడ్డి జిల్లాకేంద్రంలోని ఫల పరిశోధన కేంద్రంలో మంగళవారం నిర్వహించిన మామిడి పండ్ల ప్రదర్శన సందర్శకుల నోరూరించింది. శాస్త్రవేత్తల సమక్షంలో ప్రదర్శన నిర్వహించామని డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ కిరణ్కుమార్ తెలిపారు. ప్రతి ఏడాది వస్తున్న కొత్తరకం మామిడి వంగడాలపై ఈ సందర్భంగా ప్రదర్శనలో రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కిరణ్కుమార్ మాట్లాడుతూ.. మామిడి జన్యు సంపద శాస్త్రవేత్తలు తీసుకువచ్చే కొత్త రకం వంగడాలపై అవగాహన కల్పించేందుకే ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. మామిడి రైతులు అధికారుల సలహా తీసుకుని మామిడి తోటల పెంపకం చేపట్టాలని సూచించారు. తక్కువ ధరకు దొరికే మేలు రకం మొక్కలు నాటి అన్నదాతలు నష్టపోవద్దన్నారు.
ఫల పరిశోధన కేంద్రంలో అందుబాటులో ఉండే శాస్త్రవేత్తలను కలిసి మేలు రకం పంటల దిగుబడిపై సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. ఆ తర్వాతే మామిడి తోటల పెంపకానికి సిద్ధ్దం కావాలన్నారు. సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రంలో 77 రకాల మామిడి పండ్లు ప్రదర్శనలో పెట్టడం సంతోషకరమన్నారు. ఈ ప్రదర్శనలో ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి వెంకటేశ్వర్లు, శాస్త్రవేత్తలు హరికాంత్, మాధవి, మౌనిక, నితీశ్, వైద్యనాథ్, ఉదాన్య అధికారి కీరి, రైతులు పాల్గొన్నారు.