హుస్నాబాద్ టౌన్, జూన్ 4: గౌరవెల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు పనులను పూర్తిచేసి, సాగునీరు ఎప్పుడు ఇస్తారో కాంగ్రెస్ నాయకులు చెప్పాలని బీఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున్‌రెడ్డి డిమాండ్ చేశారు. హుస్నాబాద్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎక్కడ సమావేశం నిర్వహించినా గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెబుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ 17 నెలలుగా ఏమిచేశారని ప్రశ్నించారు. కాల్వల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు, ఎంతమేరకు భూసేకరణ చేశారో వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
నియోజకవర్గాన్ని పది వేల కోట్లరూపాయలు తీసుకువచ్చి అభివృద్ధి పరిచిన ఘనత మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌కు దక్కుతుందని అన్నారు. ఇందిరమ్మ కమిటీలో కాంగ్రెస్ నాయకులనే నియమించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాజీవ్‌యువ వికాసం పథకంలో అనర్హులను ఎంపిక చేస్తున్నారనే ఆరోపణలతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని, అయినా నిరుద్యోగులకు ప్రభుత్వతీరుపై అనుమానం ఇంకా తొలిగిపోలేదని అన్నారు. మంత్రి పొన్నం వార్డుల్లో తిరిగితే సమస్యలు తెలుస్తాయని ఎద్దేవా చేశారు. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్నాయకులు బండి పుష్ప, శ్యాంసుందర్, మేకల వికాస్‌యాదవ్ తదితరులు ఉన్నారు.