సంగారెడ్డి, మే 13(నమస్తే తెలంగాణ): చెదురుమదురు ఘటనలు మినహా జహీరాబాద్ పార్లమెంట్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జహీరాబాద్ పార్లమెంట్లో సోమవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 6గంటల తర్వాత కూడా పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులుదీరి ఉన్నారు. దీంతో రాత్రి 8 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని 1971 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ ఆ తర్వాత క్రమంగా పుంజుకుంది. ఓటర్లు ఎండను కూడా లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాకొచ్చి ఓటుహక్కును వినియోగించుకున్నారు.
పురుషులతో సమానంగా మహిళలు ఓటింగ్‌లో పాలుపంచుకున్నారు. జహీరాబాద్ పార్లమెంట్లో రాజకీయ విశ్లేషకులు అంచనా వేసిన దానికంటే ఎక్కువగా పోలింగ్ నమోదైంది. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్, ఎల్లారెడి, బాన్సువాడ, జుక్కల్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్లో నుంచి మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు మిగితా అభ్యర్థులు ఓటుహక్కును వినియోగించుకోవటంతోపాటు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు.
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ అభ్యర్థులతో పాటు పలువురు ముఖ్యులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ కుటుంబసభ్యులతో కలిసి ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం మొగుడంపల్లి మండలం మాడ్గిలో ఓటుహక్కు వినియోగించుకున్నారు.
అనంతరం అనిల్‌కుమార్ లింగంపల్లి(రాయికోడ్), నిజాంపేట, పిట్లం(జుక్కల్), గాంధారి(ఎల్లారెడ్డి), బస్వాపూర్(కామారెడ్డి) పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. మంత్రి దామోదర రాజనర్సింహ కుటుంబసభ్యులతో కలిసి జోగిపేటలో ఓటు వేశారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేశ్‌షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్‌లో ఓటు వేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్‌రావు ఝరాసంగంలో, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఈదులపల్లిలో ఓటు వేశారు. మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పోతులబోగూడలో, నారాయణఖేడ్ మాజీఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఖానాపూర్(కె)లో ఓటు వేశారు.
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఆలస్యంగా ఓటింగ్ ప్రారంభమైంది. న్యాల్కల్ మండలంలోని మామిడ్గి, ఖాజాపూర్‌లో ఈవీఎంలు మొరాయించాయి. అందోల్ మున్సిపాలిటీలోని 195వ పోలింగ్ కేంద్రం, టేక్మాల్ మండలం పాల్వంచ, ‘ఖేడ్’లోని 170 పోలింగ్ కేం ద్రంలో ఈవీఎంలు మొరాయించాయి.
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అందోలు నియోజకవర్గం పరిధిలోని వట్పల్లి మండలం మర్వెల్లి గ్రామంలో బీఆర్ఎస్ ఎంపీటీసీ సంగప్పపై కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడిగా దాడి చేసి గాయపర్చారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు కలుగజేసుకుని ఇరువర్గాలను పోలింగ్ కేంద్రం వద్ద నుంచి పంపించి వేశారు.
నారాయణఖేడ్ పట్టణంలో ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్ సోదరుడు నగేశ్ షెట్కార్ 175వ పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ నాయకులతో ఘర్షణకు దిగి బీజేపీ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు స్పందించి ఇరువర్గాలను చెదరగొట్టారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్ నారాయణఖేడ్ వచ్చి బందోబస్తును పర్యవేక్షించడంతో గొడవలు సద్దుమణిగాయి. కోహీర్, ఝరాసంగం మండలాల్లో అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి.